
( ఫిబ్రవరి 21 – అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం )
మనిషి అభిప్రాయాన్ని వ్యక్త పరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న సకల జీవరాశులలో మానవుడు ఒక్కడే తన భావాల్ని వాగ్రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి తన మనసులోని అభిప్రాయాల్ని, భావాల్ని బహిర్గతం చేయటానికి ముఖావయవంతో చేసే అర్థవంతమైన ధ్వనుల సముదాయమే ‘భాష’. శిశువుకు తొలి విజ్ఞానాన్ని ఇచ్చేది, మనసులోని భావాలకు, అభిప్రాయాల వ్యక్తీకరణకు రూపం ఇచ్చేది, సభ్యతా సంస్కారాల పైన, చరిత్ర-సంస్కృతుల మీద గౌరవ భావం పెంచేది మాతృభాష. ఇది జన్మతః వచ్చే మాధ్యమం.
మాతృ భాషను రక్షించుకోవడానికి 1999లో యునెస్కో ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వేల స్థానిక భాషలున్నా.. కొన్ని వందల భాషలకే విద్యా వ్యవస్థలో చోటు దక్కింది. మాతృ భాషా దినోత్సవంగా ఫిబ్రవరి 21ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్‌ను తూర్పు పాకిస్థాన్‌గా పిలిచేవారు. వారి మాతృభాష బెంగాలీ. కానీ, వారి భాషకు తగిన గుర్తింపు లేదు. అందుకే, తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు. ఆ ఉద్యమం 1952 నుంచి నాలుగేళ్లపాటు సాగింది. విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా దీనిలో పాల్గొన్నారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం.. మేధావుల్ని, అధ్యాపకులను జైళ్లలో వేసింది. ఫిబ్రవరి 21న పోలీసులతో కాల్పులు జరిపించింది. మాతృభాష కోసం మొదలుపెట్టిన ఆ ఉద్యమంలో నెత్తురు ఏరులైపారింది. మాతృభాష పరిరక్షణ కోసం నలుగురు యువకులు అసువులు బాశారు. చివరికి దిగొచ్చిన పాక్ ప్రభుత్వం 1956లో బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలు చేసింది. అయితే బంగ్లాదేశ్ అభ్యర్థన మేరకు యునెస్కో ఆ రోజునే మాతృభాష దినోత్సవంగా జరిపేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు భారత్, పాక్ సహా 28 దేశాలు మద్దతిచ్చాయి. బంగ్లాదేశ్‌లో జరిగిన సంఘటనను పురస్కరించుకుని యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.
ప్రపంచంలో సుమారు ఏడువేల భాషల్లో, 230 భాషలు అంతరించాయి. ఇంకా 3 వేల భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో వెల్లడించింది. ఒక్క భారతదేశంలోనే 196 భాషలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. గ్లోబలైజేషన్ ఇతర కారణాల వల్ల ప్రపంచంలో ప్రతి రెండు వారాలకు ఒక భాష అంతరించిపోతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం అంతా మనకు దగ్గరవుతోండగా, మన భాష మాత్రం మనకు దూరమవుతోంది. భాషాసంస్కృతులు ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి మారుతోన్న మన సంస్కృతితో పాటుగా మన భాష కూడా మారుతోంది. ఒకప్పుడు భాషలో వచ్చే మార్పులకు కొన్ని తరాలు పడితే, ఈ ఆధునిక యుగంలో ఒక్క తరంలోనే ఎన్నో మార్పులను చూస్తున్నాము.





