News

వ్యవసాయ భూముల పునరుద్ధరణకు ఇస్రో సహకారం ; భువన్ పోర్టల్ ను రూపొందించిన శాస్త్రవేత్తలు

202views

దేశవ్యాప్తంగా వృథాగా ఉన్న బంజరు భూములను పునరుద్ధరించి అటవీ, వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచాలన్న నీతి ఆయోగ్ సూచనతో భువన్ పోర్టల్ ను రూపొందించినట్లు ఇస్రో అధికారులు బెంగళూరులో ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో తయారు చేసిన ఈ జియో పోర్టల్ తో దేశంలోని ప్రతి జిల్లాలోని వ్యవసాయ, అటవీ భూముల వాస్తవిక స్థితిని సమీక్షించే వీలుందని సోమవారం వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా వృథాగా ఉన్న భూములు, వాటి సారం, సేంద్రియ, కర్బన ఉద్గారాల డేటాబేస్ను భువన్ సమీకరిస్తుంది. రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలోని వ్యవసాయ అనుబంధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అంకుర సంస్థలు, శాస్త్ర వేత్తలు ఈ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ నెల 12న నీతి ఆయోగ్ నేతృత్వంలో ఈ పోర్టల్ పాటు గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ల్యండ్ విత్ ఆగ్రోఫారెస్ట్రీ(గ్రో)ను ఆవిష్కరించాం’ అని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడిం చారు. ఆగ్రోఫారెస్ట్రీ సూటబిలిటీ ఇండెక్స్ (ఏఎస్ఐ) ప్రకారం రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాణలను వ్యవసాయ, అటవీ ప్రాంతాలను విస్తరించేందుకు వీలైన రాష్ట్రాలుగా గుర్తించారు. జమ్మూకశ్మీర్, మణిపుర్, నాగాలాండ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వాల సహకారంతో ఏఎస్ఐ సమాచారం ఆధారంగా సమీక్షలు చేపట్టి వ్యవసాయ, అటవీ భూముల విస్తరణ పనులు ప్రారంభించాలని ఇస్రో యోచిస్తోంది.