
జైన మత ఆచార్యులలో ఒకరైన ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహరాజ్ అస్తమయం చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లో ఉన్న చంద్రగిరి తీర్థంలో ఉండే విద్యాసాగర్ జీ మహరాజ్.. కన్నుమూసినట్లు చంద్రగిరి తీర్థంలో ఉండే ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2.35 గంటలకు విద్యాసాగర్ జీ మహరాజ్ చనిపోయినట్లు ప్రకటించారు. అయితే గత 3 రోజుల నుంచి మహారాజ్ ఆహారం, నీరు తీసుకోవడం మానేశారని వారు వెల్లడించారు.
విద్యాసాగర్ మహారాజ్ మృతిపట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారు సంతాపం తెలిపారు. గౌరవనీయులైన శ్రీ విద్యా సాగర్ జీ మహారాజ్ 1968లో దిగంబరీ దీక్షను స్వీకరించారని అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన నిరంతరం సత్యం, అహింస, అపరిగ్రహ, ఆచార్య, బ్రహ్మచర్యలను ఆచరిస్తూ ఈ పంచ మహావ్రతాల దేశవ్యాప్త ప్రచారానికి తనను తాను అంకితం చేసుకున్నారని ఎక్స్(ట్విట్టర్) ద్వారా మోహన్ భాగవత్ గారు గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమ స్ఫూర్తితో ప్రేరణ పొందిన పూజ్య ఆచార్య శ్రీ మహారాజ్ తన జీవితంలో వందలాది మంది సన్యాసులు మరియు సన్యాసినులకు దీక్షను అందించారని చెప్పారు. దాతృత్వ కార్యక్రమాలకు తన ఆశీర్వాదాలను ఎల్లప్పుడు అందించారని గుర్తు చేసుకున్నారు. ఆచార్య శ్రీ మహారాజ్ జీ భారతదేశం అంతటా వివిధ ప్రదేశాల్లో గోశాలలు, విద్యా సంస్థలు, చేనేత కేంద్రాలు మరియు ఇతర సంస్థలను స్థాపించారని వెల్లడించారు.
విద్యాసాగర్ మహారాజ్ గారి ఆశీస్సులతోనే ఎన్నో జైళ్లల్లో ఉన్న వేలాది మంది జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చే అపూర్వమైన కార్యక్రమం సాగుతోందని సర్ సంఘ్ చాలక్ గారు చెప్పారు. తన ఉదాత్తమైన బోధనలు మరియు జీవిత ఆదర్శాలతో భారతదేశం మళ్లీ తలెత్తుకొని ప్రస్తుత కాలంలో ప్రపంచానికి కొత్త దిశను అందించాలని విద్యాసాగర్ మహారాజ్ ఆకాంక్షించారని మోహన్ భాగవత్ గారు చెప్పారు. ఈ ఆదర్శాలకే విద్యాసాగర్ మహారాజ్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. తన చివరి శ్వాస వరకు ధృడమైన ధ్యానాన్ని కొనసాగించారని నేడు లక్షలాది మంది ఆ ఆదర్శాలను అనుసరిస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యాసాగర్ మహారాజ్ నిష్క్రమణ పట్ల ప్రతి ఒక్కరికీ బాధ కలగడం సహజమేనని మోహన్ భాగవత్ గారు అన్నారు.
ప్రపంచ ప్రసిద్ధ సన్యాసి శిరోమణి గురు దేవ్ విద్యాసాగర్ జీ మహారాజ్ 1946 అక్టోబర్ 10న కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని సదల్గాలో శరద్ పూర్ణిమ రోజున విద్యాధర్‌గా జన్మించారు. అతని తండ్రి మల్లప్ప తరువాత ముని మల్లిసాగర్ అయ్యారు. అతని తల్లి శ్రీమంతి తరువాత ఆర్యక 105 సమయమతి మాతాజీగా మారారు. ఆచార్య విద్యాసాగర్ జీ 30 జూన్ 1968న అజ్మీర్‌లో 22 సంవత్సరాల వయసులో ఆచార్య శాంతిసాగర్ జీ శిష్యుడైన ఆచార్య జ్ఞానసాగర్ ద్వారా దీక్షను స్వీకరించారు. ఆచార్య విద్యాసాగర్ జీకి గురు జ్ఞానసాగర్ జీ 22 నవంబర్ 1992న ఆచార్య పదవిని ఇచ్చారు. ఆచార్య విద్యా సాగర్ సంస్కృతం, ప్రాకృతం, హిందీ, మరాఠీ, కన్నడ భాషలతో సహా వివిధ ఆధునిక భాషలలో నిపుణుల స్థాయి పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఆయన హిందీ, సంస్కృతంలో పెద్ద సంఖ్యలో కంపోజిషన్లు రాశారు. వంద మందికి పైగా పరిశోధకులు మాస్టర్స్, డాక్టరేట్ల కోసం ఆయన పనిని అధ్యయనం చేశారు.
ఆచార్య విద్యా సాగర్ మహరాజ్ మహాభినిష్క్రమణ పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర ప్రముఖులు నివాళులు అర్పించారు.





