
జాతీయోద్యమంలో ప్రముఖ న్యాయవాదిగా, సుప్రసిద్ధ పాత్రికేయుడుగా, గ్రంథ రచయితగా, అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా అందరి మన్ననలను పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి కోలవెన్ను రామకోటేశ్వరరావు. ఆయన 1894 అక్టోబర్ 22వ తేదీన నరసరావుపేటలో జన్మించారు.
రామకోటేశ్వరరావు వియ్యన్న పంతులు గారి రెండో కుమారుడు, నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్లో ఆయన పాఠశాల విద్యాభ్యాసం సాగింది. 1906లో లోయర్ సెకండరీ పరీక్ష పాసయ్యి గుంటూరు హైస్కూల్లో చేరి 1908లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. 1909లో బందరు నోబుల్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పరీక్షల్లో కృతార్థుడయ్యాడు. తర్వాత చెన్నపట్నం ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎ.(ఆనర్స్) చేశాడు. తర్వాత లా డిగ్రీ చేశాడు. 1913 జూన్ 13వ తేదీన ఆయన వివాహం రాజ్యలక్ష్మితో జరిగింది.
నరసరావుపేటలో 1917 నుండి 1921 వరకు ప్లీడరుగా ప్రాక్టీసు చేసాడు. పట్ల ఆయనకు చిన్నప్పటినుండి సాహిత్యాభిలాష ఉన్నందున ప్రముఖపండితులు జయంతి హస్తే రామయ్య పంతులు, గిడుగు రామ్మూర్తి పంతులు వంటి వారి పరిచయంతో స్ఫూర్తిని పొందాడు. 1917లో ప్రముఖ న్యాయవాది, సాహిత్యాభిమాని బెల్లంకొండ రాఘవరావు గారితో కలిసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అదే తర్వాత మునిసిపల్ లైబ్రరీగా మారింది.
కోలవెన్నువారికి విద్యార్ధి దశనుండి పత్రికారంగంపట్ల అభిరుచి గణనీయంగా అనేక ఉండేది. మద్రాసులో ఖాసా సుబ్బారావు, కృపానిధి వంటి ప్రముఖ పాత్రికేయులతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయ భాగ్యం, అనుభవం జీవితంలో మరిచిపోలేనిది.ఎప్పుడైనా సంపాదకీయాలు వ్రాయడం, వార్తలను ఎడిట్ చేయడం వంటివి సంతోషంగా చేసేవారు. పట్టాభి సీతారామయ్య సలహామేరకు 1923లో బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకులుగా చేరారు. 1933 నుండి 34 వరకు కొన్నాళ్ళు ప్రిన్సిపాల్ గానూ పనిచేశారు. కళాశాల కార్యనిర్వాహక వర్గం ప్రభుత్వ ఆర్థిక సహాయంపొందటానికి నిర్ణయించడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. రామకోటేశ్వరరావు ఆ ప్రతిపాదనకు ఇష్టంలేని రామకోటేశ్వర రావు ఉద్యోగానికి రాజీనామా చేశారు.
విశ్వనాథ సత్యనారాయణ గారితో కలిసి 1927 డిసెంబరులో త్రివేణి ద్వైమాస పత్రికను ప్రారంభించారు. అది అప్పటి నుండి ప్రామాణిక ఆంగ్ల సాహిత్య పత్రికంగా తొమ్మిది సంవత్సరాలపాటు నిర్వహించారు.ఆ తర్వాత త్రైమాసిక పత్రికగా కొన్నాళ్ళు సాగింది.1931లో సాహిత్యాభిమానుల ప్రేరణతో మాస పత్రికగా మారింది.నాలుగు సం||ల పాటు పాఠకుల అభిమాన ఆంగ్ల పత్రికగా నిరాటంకంగా నడిచి ఆర్ధిక ఇబ్బందులతో కుంటుపడింది.
భారతీయ సంస్కృతిలో ఉన్న ఏకత్వంలోని భిన్నత్వాన్ని, భిన్నత్వంలోని ఏకత్వాన్ని వివిధ ప్రాంతాల్లో, వివిధభాషల్లో వికసిస్తున్న జ్ఞానతృష్ణను, సారస్వత పునరుజ్జీవనాన్ని జిజ్ఞాసతో దర్శించడమే త్రివేణీ పత్రిక పరమాదర్శంగా సాగింది. రాజకీయ పక్షానికి సంబంధం లేని ఉన్నతస్థాయి రాజకీయాలతోను, వివిధ ప్రాంతాల కళలు, సాహిత్యరీతులను సమన్వయ దృష్టితో పరిశీలించడమే లక్ష్యంగా త్రివేణి పత్రికను నిర్వహించారు.
చెన్నపట్నంలో 1937లో ఆకాశవాణి ప్రారంభమైంది. అందులో తొలి ప్రసంగం వ్యావహారిక భాషావేత్త గిడుగు రామ్మూర్తి పంతులుగారు చేశారు. రెండో ప్రసంగాన్ని కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు చేశారు. 1954లో బెంగుళూరులో త్రివేణీ పత్రిక రజతోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. 1957లో కోలవెన్ను వారు దక్షిణ భారత భాషా పుస్తక ప్రచురణ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
కోలవెన్ను వారిపై ప్రముఖ జాతీయోద్యమ నాయకులు సి. రాజగోపాలాచారి, పట్టాభి సీతారామయ్య వంటివారి ప్రభావం ప్రగాఢంగా, బలీయంగా ఉంది. గాంధీజీ పిలుపుతో కోలవెన్ను వారు 1922లో న్యాయవాద వృత్తిని వదులుకుని సహాయనిరాకరణ ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా పాల్గొన్నారు. విదేశీ వస్తు బహిష్కరణ, ఖాదీ వస్త్రధారణ వంటి కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొని అరెస్టయి జైలుకు వెళ్ళారు.
1930లో గాంధీజీ ఆదేశానుసారం దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి జైలుశిక్ష అనుభవించారు. 1940లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్ళారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అరెస్టయి
జైలుశిక్ష అనుభవించారు. దేశభక్తి తత్పరుడిగా, గాంధీజీ అభిమానిగా, స్వాతంత్ర్య సాధనా దీక్షాపరుడిగా కోలవెన్నువారు జాతీయోద్యమంలో నిబద్ధతతో పాల్గొన్న కార్యకర్తగా జైలుజీవితాన్ని గడిపాడు.
కోలవెన్ను వారి రచనలు ‘మహారాష్ట్ర వీరులు’ ‘కౌంట్ కపూర్ ఆఫ్ ఇటలీ’ అనేవి జాతీయోద్యమంలో ఎందరో యువకులను, విద్యావేత్తలను ఆకర్షించి ఉద్యమపథంలో నడిపించాయి. కొత్త రఘురావయ్యగారితో కలిసి భారత రాజ్యాంగాన్ని శైలీ సుందరంగా తెలుగులోకి అనువదించారు.
ప్రముఖ న్యాయవాదిగా, పాత్రికేయుడుగా, గ్రంథ రచయితగా, జాతీయోద్యమ కార్యకర్తగా కోలవెన్ను వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన 1970 మే 19వ తేదీన భౌతికంగా దూరమైనా, ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులు.





