News

వట్టి చేతులే ఆయుధాలు

281views

గల్వాన్‌ ఘర్షణ తర్వాత నుంచి భారత సైన్యం శిక్షణలో మార్పులు చేసినట్లు తెలిసింది. ఆయా రెజిమెంట్లలో సైనికులకు రోజువారీ దేహదారుఢ్య శిక్షణతో పాటు.. వివిధ మార్షల్‌ ఆర్ట్స్‌నూ భాగం చేసినట్లు సైనిక వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. పంజాబ్‌ రెజిమెంట్‌లోని వారికి గత్కా, గూర్ఖా రెజిమెంట్‌కు కుక్రీ డ్యాన్స్‌, మద్రాస్‌ రెజిమెంట్‌కు కలిరిపయట్టు వంటివి నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన సైనికులను అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కిబితు ప్రాంతంలో మోహరించారు. వారు ఇటీవల కొందరు పాత్రికేయుల ముందు మార్షల్‌ ఆర్ట్స్‌ను ప్రదర్శించి చూపారు. ఆ యూనిట్‌కు చెందిన మేజర్‌ కార్తికేయ మాట్లాడుతూ.. స్థానిక భౌగోళిక స్వరూపం, గస్తీ సమయంలో ఎదురయ్యే సవాళ్లు భిన్నమైనవన్నారు.

‘‘వేగంగా ప్రవహించే నదులు, ముళ్లు, వర్షాలు, త్వరగా మారిపోయే వాతావరణం, ఎత్తయిన శిఖరాల వంటివి ఇక్కడ ఉంటాయి. దీంతో నిత్యం శిక్షణ తప్పనిసరి. వీటిల్లో మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా ఒకటి’’ అని వెల్లడించారు. ఇలాంటి అభిప్రాయాన్నే ఆ యూనిట్‌ అధిపతి కర్నల్‌ ప్రిన్స్‌ రోహిత్‌ వ్యక్తం చేశారు. గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఉధంపుర్‌లోని నార్తర్న్‌ కమాండ్‌.. ఇజ్రాయెల్‌కు చెందిన ‘క్రావ్‌ మాగా’ అనే మార్షల్‌ ఆర్ట్స్‌ను సైనిక శిక్షణలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆయా యూనిట్లకు లేఖలు రాసింది. ఆ తర్వాత అవి తమకు అనుబంధంగా అవసరమైన యుద్ధ విద్యను ఎంపిక చేసుకున్నాయి.

‘‘సరిహద్దుల వెంట ఘర్షణలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. మనకు ఇప్పటికే ఉన్న పలు భారతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ ఆ సమయంలో సరిగ్గా సరిపోతాయి’’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. 45 ఏళ్ల లోపు సైనికులు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉన్నామని నిరూపించుకునేందుకు ఇప్పటికే ప్రతి త్రైమాసికంలో యుద్ధ సన్నద్ధత, సామర్థ్య పరీక్ష (బీపీఈటీ)ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిలో 30ఏళ్ల లోపు వారు 5 కిలోమీటర్ల పరుగును 25 నిమిషాల్లో ముగించాలి. 30-40 మధ్య వయస్కులకు అదనంగా మరో రెండు నిమిషాల సమయం ఇస్తారు. అధికారుల ఫిట్‌నెస్‌కు సంబంధించిన నిబంధనలను కూడా సైన్యం మార్చింది. ఇవి ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. భారత్‌-చైనా సైనికుల మధ్య 2020లో గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగింది. ఈ సమయంలో ఇరు దేశాల సైనికులు రాళ్లు, కర్రలతో తలపడ్డారు. వాస్తవాధీన రేఖ వద్ద తుపాకుల వంటి ఆయుధాలు వినియోగించకూడదని ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైన్యం శిక్షణలో మార్షల్‌ ఆర్ట్స్‌ను భాగం చేయడం విశేషం.