
వేష భాషలు వేరైనా .. మనమంతా ఒక్కటే… భారతీయులమే అన్న భావన నూట ముపై కోట్లమంది ప్రజల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయింది.’ స్వాతంత్రమే నా జన్మ హక్కు’, ‘జైహింద్’, వంటి నినాదాలతో కులమతాలకు అతీతంగా ఒక్కటై బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్నాం. స్వాతంత్ర్యం సాధించి నూరేళ్లు పూర్తి చేసుకునే రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను ఆర్థిక రంగంలో అగ్ర రాజ్యంగా, విద్య, సాంస్కృతిక రంగాల్లో విశ్వగురువుగా తీర్చి దిద్దాలన్న మహత్తర లక్ష్యంతో మనం అందరం సమైక్యంగా ముందుకు సాగుతున్నాం.
ఆ లక్ష్య సాధన కోసం ఎదురవుతున్న సవాళ్లు, అవరోధాలను ఒక్కొక్కదానిని తొలగించుకుంటూ కృతనిశ్చయంతో ముందుకెళుతున్నాం. ఒకే దేశం.. ఒకే చట్టం అన్న ఉద్దేశ్యంతో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన మూడు వందల డెబ్బై అధికారణాన్ని రద్దు చేయడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా మన పార్లమెంట్ రూపొందించిన చట్టాలు అన్ని అమలు జరుగుతున్నాయి ఇక, ఒకే ప్రజా ..ఒకే చట్టం అన్న ఆశయాన్ని కూడా మనం నెరవేర్చుకోవాలి. దేశంలోని వివిధమతాలకు ఆయా మతసూత్రాలు ఆధారంగా చట్టాలు అమలు జరుగుతున్నాయి.
దాని ఫలితంగా అనేక సామాజిక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా, వివాహం, విడాకులు, భరణం, ఉమ్మడి కుటుంబ ఆస్తిలో హక్కులు వంటి అంశాల్లో ఒక్కో మత చట్టం ఒక్కో విధానాన్ని అవలంబిస్తోంది అది కుటుంబ సభ్యుల మధ్య అంతరాలను సృష్టిస్తోంది. నేటి ఆధునిక సమాజంలో కూడా మహిళలు వివక్షతకు గురవుతున్నారు. వివాహం, విడాకులల్లో వారికి స్వేచ్ఛ లేదు. వారసత్వపు ఆస్తిలో హక్కు లేదు. దాని ఫలితంగా వారి జీవన స్థితిగతులు దుర్లభమైపోతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఉమ్మడి పౌర స్మృతి ఒక్కటే ఆ సామాజిక, ఆర్ధిక సమస్యలకు పరిష్కారం చూపగలదు. ఈ ఉమ్మడి పౌర స్మృతి అంశం కొత్తగా తెర పైకి వచ్చింది కాదని మనం గ్రహించాలి.
స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్తులో న్యాయ కోవిదులు, మేధావులు ఉమ్మడి పౌర స్మృతి అవశ్యకతను గుర్తించారు. సమాజంలోని అన్ని మతాలకు, వర్గాలకు ఒకే చట్టం అవసరమని భావించి దానికి అనుగుణంగా ప్రాదేశిక సూత్రాల కింద 44వ అధికారణంగా దానిని చేర్చారు. ఆ అధికరణం కింద దేశ ప్రజలు అందరికి ఒకే చట్టాన్ని రూపొందించవలసిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఉమ్మడి పౌర స్మృతిని ఒక న్యాయ సూత్రాలతో కూడిన అంశంగా మాత్రమే మనం గుర్తించాలి. దేశంలోని వివిధ న్యాయస్థానాలు పలు సందర్భాల్లో ఉమ్మడి పౌర స్మృతి అవసరాన్ని వెల్లడించాయి ముఖ్యంగా,35 ఏళ్ళ క్రితం మన అత్యున్నత న్యాయస్థానం షా బానో కేసులో ఉమ్మడి పౌర స్మృతి అవసరాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వెల్లడించింది. అనంతరం మరికొన్ని సందర్భాల్లో సైతం సుప్రీం కోర్ట్ అదే విధమైన తీర్పులను వెల్లడించింది.
భారత రాజ్యాంగంతోపాటు సుప్రీమ్ కోర్ట్ తీర్పులను మనం గౌరవించాలి .. ఆదరించాలి… అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై, దేశంలోని వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి ఉమ్మడి పౌర స్మృతి రూపకల్పనలో ప్రభుత్వానికి తగిన సూచనలు అందించడానికి సైతం చర్యలు చేపట్టింది అదే విధంగా, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా కూడా ఈ అంశంపై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించింది.
భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులను పొందుపర్చారని, ద్వంద్వ చట్టాల వ్యవస్థ తొలగిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. మతాలు, వర్గాలు ఆధారంగా చట్టాల రూపకల్పన జరగకూడదని, రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి రావాలని విశ్లేషకులు అంటున్నారు.
ఈ అంశంపై సమాజంలోని ప్రతిఒక్కరు, రాజకీయ, మతపరమైన దృక్పథంతో కాకుండా, సామజిక కోణంలో ఆలోచించవలసిన సమయం ఆసన్నమయింది. ప్రపంచంలోని పలు దేశాల్లో, భిన్న మతాల, సంస్కృతుల, జాతుల ప్రజలు జీవిస్తూ తమతమ సంప్రదాయాలు, ఆచారాలకు భంగం వాటిల్లకుండా ఒకే చట్టాన్ని అమలు చేసుకుంటూ సమైక్యంగా జీవిస్తున్నారు. ఐతే మన దేశంలో మాత్రమే మిగిలిన దేశాలకు భిన్నంగా మతాల ప్రాతిపదికన చట్టాలు అమలు జరుగుతున్నాయి.
ఉమ్మడి పౌర స్మృతి అమలుతో రాజ్యాంగం అందించిన మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలుగుతుందన్న ఆందోళనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ, వారు గమనించవలసింది, రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లినపుడు న్యాయ పరమైన పోరాటం చేసే హక్కును కూడా రాజ్యాంగం మనకు ప్రసాదించిందని గుర్తించాలి.
భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచిన విధంగా లౌకిక రాజ్యం ఏర్పాటుకు, సమానత్వ సాధనకు ఉమ్మడి పౌర స్మృతి ఒక్కటే మార్గం చూపగలదన్న విషయాన్ని మనం గమనించాలి. కులమతాలకు అతీతంగా దేశ ప్రజలు అందరు ఒక్కటే… ఏక్ భారత్.. శ్రేష్ట భారత్ నినాదంతో ముందుకు సాగుదాం.





