News

సూర్యదేవా.. నమోనమామి

204views

రథసప్తమిని పురస్కరించుకొని శుక్రవారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమాలు జరిగాయి. యోగా విశిష్టతను, సూర్యనమస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వివేకానంద యోగకేంద్రం ఆధ్వర్యంలో తెల్లవారుజామున నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో సామూహిక సూర్యనమస్కార యజ్ఞం నిర్వహించారు. సూర్యభగవానుని స్తుతిస్తూ సాగిన మంత్రాలకనుగుణంగా వందలాది మంది యోగా సాధకులు 108 సామూహిక నమస్కారాలు చేశారు. ముఖ్య అతిథి ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దివాకరరెడ్డి, వివేకానంద యోగ కేంద్ర అధ్యక్షులు మెళవాయి రాజశేఖరరెడ్డి తదితరులు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఒత్తిడి నిండిన జీవితానికి యోగా మాత్రమే పరిష్కారమార్గమన్నారు. రోజూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల చక్కటి వ్యాయామంతో పాటూ రోగాలు దరిచేరవని మనసు ఉల్లాసంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో యోగా గురువులు దివాకర్‌, మారుతీప్రసాద్‌, ఆంజనేయులు, కటకం కృష్ణవేణి, పీడీ శ్రీరాములు పాల్గొన్నారు.

ఒంగోలులో రికార్డు స్థాయిలో సూర్య నమస్కారాలు!
లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు ధ్యేయంగా రథసప్తమిని పురస్కరించుకుని శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో వేల మంది విద్యార్థులు సూర్య నమస్కారం చేశారు. యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన మహా సూర్య నమస్కారం కార్యక్రమానికి వివిధ
మండలాల నుంచి విద్యార్థులు వచ్చారు. 1.40 గంటలపాటు 108 సార్లు సూర్య నమస్కారం చేశారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధి కారి సుభద్ర, ఉప రవాణా కమిషనర్ ఆర్.సుశీల, అదనపు ఎస్పీ(అడ్మిన్) కె. నాగేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు