News

సంఘం ద్వారా తయారైన కార్యకర్తల ద్వారా వికసిత భారతదేశం : సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

403views

మన శ్రద్ధ నిష్టలను తగ్గించుకోకుండా అకుంఠిత దీక్షతో పనిచేయటం ద్వారా సుఖశాంతులతో తులతూగే వికసిత భారతం నిర్మాణం అవుతుందని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భగవత్ అన్నారు. కర్నూలు నగరంలో జరిగిన విశేష నగర సాంఘిక్ లో ఆయన మాట్లాడుతూ శరీరాన్ని, మనసును, బుద్ధిని ఏకీకృతం చేసి సాధన చేయాలి. సత్య, న్యాయ సమ్మతమైన ఈ మార్గంలో ధైర్యంగా, విచలితులం కాకుండా నడవాలని కార్యకర్తలను కోరారు.సంఘం హిందూ ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్నది. సమాజ ఉన్నతిలోనే మన ఉన్నతి అనే భావన మనసులో నింపుకొని డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని ఇదే భావన నేడు దేశమంతా వ్యాపించిందన్నారు. అయితే చాలామందిలో ఈ భావన ఇంకా అంతర్లీనంగా ఉంది. దీనిని బయటకు తీసుకురావాలి. ఈ సమాజం పట్ల దేశం పట్ల భక్తి నిర్మాణమై, వికసితమైతే శక్తి నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు.

విద్యార్థులు, యువకులు, పెద్దలకు జరుగుతున్న సంఘ శాఖల ద్వారా బస్తీల వికాసం జరగాలి. సమాజ హితం కోసం స్వయం సేవకులు పనిచేయాలని శ్రీ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

కర్నూలులోని ఇండస్ స్కూల్లో జరిగిన ఈ సాంఘిక్ లో నగరంలోని 50 బస్తీల నుండి 1287 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సంఘచాలక్ శ్రీ నాగరాజు, ప్రాంత సంఘచాలక్ శ్రీ హరి కుమార్ రెడ్డి, విభాగ్ సంఘచాలక్ శ్రీ నీలకంఠం, జిల్లా సంఘచాలక్ శ్రీ ఎన్ వి ఎస్ గుప్తా, నగర సంఘ చాలక్ శ్రీ చల్లా వాసు రెడ్డి పాల్గొన్నారు.