ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ సారథులు – 17 ; మద్దూరి అన్నపూర్ణయ్య

371views

మద్దూరి అన్నపూర్ణయ్య రచనకు వున్న శక్తిని గుర్తించిన వ్యక్తి. బ్రిటీష్ హయాంలో ‘ప్రమాదకర రచనలు’ చేసి ‘రాజద్రోహం’ క్రింద, కారాగారం అనుభవించిన శక్తిమంతుడైన రచయిత ఆయన. ఒకటికాదు, రెండుకాదు, 14 సంవత్సరాలు ఆయన జైలులో మగ్గాడు. భావ ప్రకటనా స్వేచ్ఛకోసం జరిపిన యుద్ధంలో అంత సుదీర్ఘకాలం శిక్ష అనుభవించిన సంఘటన ఇక్కడ జరగడం గర్వకారణమే అయినా, అది వెలుగు చూడవలసిన స్థాయిలో చరిత్ర పుటలలో చోటు చేసుకొనకపోవడం చాలా విచారకరం.

స్వాతంత్రోద్యమ కాలంలో కనిపించే అరుదైన పత్రికా రచయితల్లో మేటి మద్దూరి అన్నపూర్ణయ్య. గాంధీజీ పిలుపుతో స్వరాజ్య సమరంలో ప్రవేశించారాయన. అయితే తన పత్రికను తీవ్ర జాతీయవాదాన్ని శ్లాఘించే రచనలతో వెలువరించేవాడు. కాంగ్రేస్ సోషలిస్టు పార్టీని అభిమానించా డాయన, సోషలిజం వైపు మొగ్గాడు. సుభాష్ చంద్ర బోస్ అభిమానానికి పాత్రుడయ్యాడు. ఫార్వార్డ్ బ్లాక్లో తిరిగాడు. చివరిదశలో కమ్యూనిస్టులతో గళం కలిపాడు. ఆయన మొదటి పత్రిక “కాంగ్రేసు”. ఆయన పోరాట చరిత్ర అంతా నిజానికి ఈ పత్రిక తోనే ముడిపడివుంది. తరువాత ‘వెలుగు, ‘నవశక్తి’, ‘జయభారత్’ పత్రికలను స్థాపించాడు. ఇందులో ‘నవశక్తి’ని కమ్యూనిస్టుల తమ రాజకీయ తరగతులలో పంచిపెట్టేవారు. ఆ పత్రిక విద్యార్ధి, వామపక్ష ద్యమాలకు మద్దతు పలికేది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర ‘కొమరగిరి’ అనే వూరు అన్నపూర్ణయ్య స్వస్థలం. 1899 మార్చి 20న ఆయన జన్మించాడు. కాకినాడలో పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్ చదువుతున్నపుడు స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు.

‘కాంగ్రేసు’ వ్యవస్థాపకుడు, సంపాదకుడు అన్నపూర్ణయ్యగారే. 1921 మే ఈ వారపత్రిక ప్రారంభమైంది. సైక్లోస్టయిల్ పద్ధతిన దీనిని ప్రచురించారు.రాజమండ్రి నుంచే ఈ పత్రిక ప్రచురించేవారు. అయితే సుబ్రహ్మణ్యం గారు 1924లో రాజమండ్రికి 23 కిలోమీటర్ల దూరంలోని సీతానగరంలో గౌతమీ సత్యాగ్రహాశ్రమం స్థాపించారు. దీనిని దక్షిణ సబర్మతి ఆశ్రమంగా గౌరవించేవారు. తరువాత సుబ్రహ్మణ్యం గారి ఆలోచన మేరకు 1925 ‘సెప్టెంబర్లో ‘కాంగ్రేసు’ను అక్కడికి తరలించారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతం నుంచి వెలువడిన పత్రికగా ‘కాంగ్రేసు’ ప్రసిద్ధి పొందింది. 1929 ప్రాంతానికి 14 పేజీలతో రాయల్ సైజులో వెలువడేది. – పత్రికలో రచనలు దేనికి కట్టుబడి వున్నాయో అడ్వర్టైజ్మెంట్లు కూడా అలాంటివే వుండేవి. విదేశీ వస్తువులు, మత్తు పదార్ధాల ప్రకటనలకు చోటులేదు. ఎప్పుడూ సంపూర్ణ స్వరాజ్యం తన పాలసీగా ప్రకటించుకుంది ఆ పత్రిక.

పత్రిక ప్రధానంగా మద్దూరి, క్రొవ్విడి లింగరాజు, వెంకటప్ప చేతులు మీదుగా నడిచింది. అయితే పత్రిక బతికున్న ఒక దశాబ్దంలో (1921-1932) ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు పత్రిక ప్రచురణకు బాధ్యత వహిస్తూ జైలులో గడిపారు. ఐపిసి 124, 153-ఎ, 505 నిబంధల ప్రకారం వారు కఠినకారాగారం అనుభవించారు. పోలీసుల దాడులు, మితవాదుల నిరసనల మధ్య పదేళ్ళు ‘కాంగ్రేసు’ నిప్పుల గుండం పైనే నడిచింది.

గాంధీజీ 1929 – 33 సంవత్సరాలలో సీతానగరం సందర్శించారు. తొలిసారి ఆయన వచ్చినప్పుడు ‘కాంగ్రేసు’ పత్రిక ధోరణితో కొంచెం కలత చెందవలసిన పరిస్థితి ఎదురయింది. ‘కాంగ్రేసు’ 1929 మే సంచికను 1857 ప్రథమ స్వాతంత్ర్య సమర ఘట్ట సంస్మరణ సంచికగా రూపొందించారు మద్దూరి. ఈ సంచిక కోసమే రామచంద్రుని వెంకటప్ప ‘చిచ్చర పిడుగు’ అనే నాటికను వ్రాశారు. తాము తీవ్ర జాతీయ వాదాన్ని ఎలుగెత్తి చాటుతున్నా, మౌలికంగా గాంధీయులు కాబట్టి శాంతి, అహింసా ప్రవచనాలతోనే నాటికను ముగించారు.. అయితే అన్నపూర్ణయ్య ఈ శాంతి ప్రవచనాల స్వస్తివాచకాన్ని కాస్తా ‘ఎడిట్’ చేసేశారు. పైగా 1857 సమరంలో తొలి తూట పేల్చిన మంగళ్ పాండే ఇందులో కథానాయకుడు. చివరికి, ఈ నాటిక హింసను ప్రేరేపించేదిగా తయారయింది. దీనితో గాంధీజీ కలవరపడ్డారు. ప్రభుత్వం -కక్ష కట్టింది. కేసు విచారించి 1929, జులైలో 124 ఎ సెక్షన్ కింద పత్రిక ఎడిటర్ అయిన అన్నపూర్ణయ్యకు రాజమండ్రి మేజిస్ట్రేట్ రెండున్నర సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాడు.

అన్నపూర్ణయ్య జైలుకు వెళ్లడంతో క్రొవ్విడి లింగరాజు సంపాదకుని బాధ్యతలు చేపట్టారు. అయితే, 1930లో ఉప్పు సత్యాగ్రహం మొదలయింది. సామూహిక అరెస్టులు జరిగాయి. ఫలితంగా పత్రిక తాత్కాలికంగా మూతపడింది. చివరికి 1931లో గాంధీ-ఇర్విన్ ఒప్పందం మేరకు ఆంక్షలన్నీ తొలగిపోయాయి. ‘కాంగ్రేసు’ మళ్ళీ ప్రారంభమైంది. పత్రిక పునః ప్రారంభమైన వెంటనే, అంటే తొలిసంచికలోనే భగత్ సింగ్ బలిదానాన్ని శ్లాఘిస్తూ ‘వీరబలి’ పేరుతో సంపాదకీయం వ్రాశారు మద్దూరి రాజగురు, సుఖదేవ్‌లను స్మరించారు. దీనితో ప్రభుత్వ యంత్రాంగం ఆ పత్రికపై ఒక కన్ను వేసి వుంచింది.

కాని, సీతానగరం ఆశ్రమం చట్టవ్యతిరేకమని మద్రాసు పోర్ట్ సెయింట్ జార్జి గెజెట్ 1932 జనవరిన ఒక ప్రకటన జారీ చేసింది. ఇదే ‘కాంగ్రేసు’ పత్రికకు భరతవాక్య మయింది. జనవరి 12న ముస్తాఫా ఆలీఖాన్ ఆశ్రమంపై దాడి జి.కేర చేయించారు. ఏ వస్తువునీ పోలీసులు వదిలిపెట్టలేదు. బాల వృద్ధ విచక్షణ చూపలేదు. పరమ కిరాతంగా ప్రవర్తించారు. కాంగ్రేసు పత్రిక ప్రెస్, ఫైళ్లు సర్వనాశనం చ అయ్యాయి. రాట్నాలు, మగ్గాలు, కుటీర పరిశ్రమల పరికరాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా తరువాత ‘కాంగ్రేసు’ వెలుగు చూడలేక పోయింది. అన్నపూర్ణయ్య ఉద్యమకారుడు, పత్రికా రచయిత, మంచివక్త. అన్నపూర్ణయ్య గారి శ్రీమతి వెంకట రమణమ్మ విదేశీ వస్త్ర బహిష్కరణలో పాల్గొని జైలుకు వెళ్లారు. అన్నపూర్ణయ్య గారు జైలులో వుండగానే రమణమ్మగారు 1943లో కన్నుమూశారు. అన్నపూర్ణయ్య గారు చివరిదశలో ఏలూరులో వుండగా సెరిబ్రెల్ మలేరియాతో మార్చి 11వ తేది 1954లో తుదిశ్వాస విడిచారు.