
సామాన్య కుటుంబంలో జన్మించి అకుంఠిత దీక్షతో మాన్యుడిగా రూపొందిన మహోన్నత వ్యక్తి దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు. స్వతంత్ర జీవన ప్రతిపత్తితో అమృతాంజనం కంపెనీని స్థాపించి అపారమైన ధనాన్నీ, కీర్తినీ ఆర్జించిన ప్రజ్ఞాధురీణులు. జన్మభూమి సేవాపారీణతతో ‘ఆంధ్రపత్రిక’ను స్థాపించి జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రేరేపించిన దేశభక్తితత్పరుడు. తెలుగుసాహితీ ప్రీతితో ‘భారతి’ మాసపత్రికను స్థాపించి ఉత్తమ సాహితీ సాంస్కృతిక పత్రికగా నిర్వహించిన సాహితీప్రియులు. ‘చేతికి ఎముకలేని దాత’గా అడిగిన వారికి కాదు. సంస్థలో ‘లేదు’ అనకుండా విరివిగా విరాళాలిచ్చిన వితరణశీలి. ఆంధ్ర నాటక సమాజాలను నటులను గణనీయంగా ప్రోత్సహించి సత్కరించిన కళాభిమాని, కళాపోషకుడు ఆంధ్రులు గర్వించదగ్గ జాతీయ నాయకుడు, మహోదాత్త చరితుడు.
నాగేశ్వరరావు పంతులు 1867 మే నెల 3వ తేదీన కృష్ణాజిల్లా గుడివాడ తాలుకా ఎలకుర్రు గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు శ్యామలాంబి. బుచ్చయ్య దంపతులు. బాల్యంలో తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు ‘నాగలింగం తండ్రి సాంప్రదాయ పద్ధతిలో సంస్కృతం చదివించాలనుకున్నాడు. తల్లి మాత్రం కాలానుగుణంగా ఇంగ్లీషు విద్య చదివించాలని పట్టుబట్టింది. తల్లి కోరిక మేరకు ‘నాగలింగాన్ని’ బందరులో హిందూ ఉన్నత పాఠశాలలో చేర్చారు. ఆ పాఠశాలలో సేవ చేయ యస్.యస్.యల్.సి. చదివి కృతార్ధుడయ్యాడు. నాగలింగం సహజ సిద్ధంగా మితభాషి. చదువులో ప్రతిభావంతుడు. ఆయన తండ్రి మరణించడంతో ఆయన చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఉన్నతవిద్యపట్ల మమకారం వల్ల, మిత్రుల సహకారంతో స్పూర్తిని స్వయంకృషితో గుంటూరు ‘ఎ.ఇ.యల్.ఎమ్.’ కళాశాలలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడు అయ్యాడు. తర్వాత చెన్నపట్టణం క్రైస్తవ కళాశాలలో బి.ఎ.లో చేరాడు. చెన్నపట్నంలో వ్యాపారదక్షులైన రెంటాల వేంకట సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నాగలింగంలో ఉన్న వ్యాపార విషయాసక్తిని గమనించి తన మేనకోడలు రామాయమ్మతో నాగలింగం వివాహం జరిపించాడు. వివాహానంతరం నాగేశ్వరరావుగా మారాడు. బి.ఎ చదువు కొనసాగిస్తూ పెళ్ళి అయిన తర్వాత కేరళ సాముద్రిక, స్వర, జ్యోతిష్యశాస్త్ర గ్రంథం రచించి దాన్ని ప్రచురించేందుకు కలకత్తా వెళ్ళాడు. దానికి సరైన ప్రచారం లేక వెలుగులోకి రాలేదు. దానిమూలంగా బి.ఏ. చరిత్రలో మార్కులు తగ్గి పరీక్ష తప్పాడు. తర్వాత బి.ఏ. పూర్తి చేశాడు.
బాల్యం నుండి ఆయనలో సహజసిద్ధంగా ఉన్న స్వతంత్ర జీవన ప్రవృత్తికి రెంటాల వారి సాహచర్యం వల్ల ఆయనలో వ్యాపారదృక్పథం బలపడింది. ఎవరికీ చెప్పకుండా కలకత్తా వెళ్ళాడు. అక్కడ ఆయుర్వేద ఔషధాల కంపెనీ యజమాని ‘భౌమన్’ అనే విదేశీయుడితో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రోత్సాహం వల్ల కొంత ధనాన్ని సంపాదించాడు. అనారోగ్యం వల్ల స్వగ్రామమైన ఎలకుర్రుకు చేరాడు.రెండు సం||ల తర్వాత బొంబాయి వెళ్ళి ‘విలియం అండ్ కంపెనీ’ అనే విదేశీ దేశ సంస్థలో కొంతకాలం ఉద్యోగం చేశాడు. ఆ కంపెనీ యజమాని స్వదేశానికి తిరిగి వెళ్ళే సందర్భంలో కంపెనీని నాగేశ్వరరావుకు అప్పగించాడు. సూచీపత్రాల ద్వారా సొంత వ్యాపారం అభివృద్ధి చెందింది. కానీ ఇన్ని ఆయుర్వేద మందుల కన్నా ఒకే గురి ఒక మందుపై దృష్టినిలిపి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 1893లో ‘అమృతాంజనం’ పెయిన్ బామ్ ను అన్వేషించి ఆవిష్కరించాడు. అతిస్వల్పకాలంలో భారతదేశంలో అమృతాంజనానికి అపారమైన ఆదరణ లభించింది. విశేషంగా 3 ధనార్జన చేసి జీవితంలో స్థిరపడ్డాడు.
బొంబాయి రాష్ట్రంలో అమృతాంజనం కంపెనీ సంపాదించిన తర్వాత తన జన్మభూమి ఆంధ్రరాష్ట్రానికి ఏ విధంగా ప్రయోజనాత్మకమైన సేవ చేయాలి? అనే ఆలోచనతో 1906లో ‘ఆంధ్రపత్రిక’ను స్థాపించి బొంబాయి నుండి వారపత్రికగా నడిపాడు. ఆంధ్రోద్యమ కాలంలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి ” ఆంధ్రపత్రిక విశేషకృషి చేసింది. ఆంధ్రరాష్ట్రంలో ఊపందుకుంటున్న జాతీయోద్యమ స్ఫూర్తిని గొప్పగా ప్రేరేపించింది. ఆంధ్రుల హృదయాల్లో జాతీయోద్యమ బీజాలు అంకురింపజేసేందుకు కృష్ణాపత్రికతోపాటు ఆంధ్రపత్రిక కూడా అపారమైన కృషి చేసింది. ఆంధ్రపత్రిక 1914 నుండి దినపత్రికగా మద్రాసు నుండి నిర్వహించాడు. ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు సహాయ సంపాదకుడిగా అందులో పనిచేశాడు. ఆంధ్రలో వయోజనవిద్య ఆవశ్యకతను, గ్రంథాలయాల ప్రాముఖ్యాన్ని ప్రచారం చేస్తూ గాడిచర్ల వారు వ్యాసాలు వ్రాసేవారు.
తొలిసారిగా ‘భావకవిత్వం’ అనే పదాన్ని ఆంధ్రపత్రికలో ఆయనే ప్రయోగించాడు.. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరమని ‘ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు అయ్యేవరకు(1926) ఆంధ్రపత్రిక ద్వారా ఉద్యమాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ప్రజల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రేరేపించేందుకు రాష్ట్రంలోని గ్రంథాలయాలన్నింటికీ నాగేశ్వరరావు గారు ఆంధ్రపత్రిక కాపీలను ఉచితంగా పంపించేవాడు. ప్రత్యేకించి తెలుగు సాహిత్యాభిమానంతో 1924లో ‘భారతి’ మాసపత్రిక స్థాపించి నిర్వహించాడు. తెలుగు సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞాన విషయాలకు సంబంధించి ప్రామాణిక వ్యాసాలను ‘భారతి’లో ప్రచురించేవారు. గన్నవలేని సుబ్బరామయ్య వంటి ప్రముఖ సాహితీవేత్త భారతి పత్రికకు ఉపసంపాదకులుగా 1938 ఉండేవారు. ప్రముఖ తెలుగు కవులు విశ్వనాథ, జాషువా, రాయప్రోలు, తుమ్మ వంటి వారి పద్యాలు, ప్రముఖ సాహిత్య వ్యాసాలు ‘భారతి’లో వచ్చేవి. భారతి పత్రికలో ముద్రించబడితే ప్రామాణిక రచనగా గుర్తింపు ఉండేది. శ్రీశ్రీ గారి ప్రసిద్ధమైన ‘కవితా! ఓకవితా!’ ఖండికను భారతి వారు ప్రచురణకు స్వీకరించకుండా అప్పట్లో త్రిప్పిపంపారు. రచయితల రచనలకు పారితోషకం చెల్లించే సంప్రదాయం భారత పత్రికతోనే మొదలైంది. నాగేశ్వరరావు గారు ఆంధ్రపత్రిక, భారతి మాసపత్రికల్లో వచ్చే నష్టాన్ని ‘అమృతాంజనం’ లాభాల ద్వారా పూడ్చుకొనేవారు. సేవాదృష్టి గల ప్రముఖ పత్రికాధిపతిగా నాగేశ్వరరావు గారు ప్రశంసనీయులు.
మహాత్మాగాంధి జాతీయోద్యమంలో ప్రవేశించిన తర్వాత ఉద్యమం ముమ్మరంగా ఊపందుకుంది. నాగేశ్వరరావు గారు పత్రికల ద్వారా ప్రజలను ప్రబోధించడమే కాక, ఆంధ్రప్రాంతంలో అనేక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను జాతీయోద్యమంలో పాల్గొనే విధంగా చైతన్యపరిచాడు. గాంధీగారి ఆదేశానుసారంగా దండి సత్యాగ్రహం. శాసనోల్లంఘన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 1930-32 ప్రాంతాల్లో నాలుగు సార్లు జైలుకు వెళ్ళాడు.
మద్రాసులో 1924లో జరిగిన ఆంధ్రమహాసభలో ఆయన దేశభక్తితత్పరతన గుర్తించి ‘దేశోద్ధారక’ బిరుదును ప్రదానం చేశారు. ఆయన వ్యక్తిత్వం, ఉదాత్త ఉదాస విలసితం. అర్థించిన వారికి వందలు, వేలు, లక్షలు దానం చేసిన వితరణశీలి. ఆంధ్ర నాటక సమాజాలను నటులను ఎంతో ప్రోత్సహించి సత్కరించిన కళాపోషకుడు. ఆయన కళాభిమానానికి తార్కాణంగా విజయవాడలో ‘దుర్గాకళామందిర్’ నిర్మించాడు.
1929లో విజయవాడలో మహత్మాగాంధీ గారి ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయనను ‘విశ్వదాత’ బిరుదుతో సత్కరించి ప్రశంసించారు. 1934 శాసనసభ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆంధ్ర గ్రంథమాలను స్థాపించి ఎన్నో అమూల్యమైన గ్రంథాలను ప్రచురించాడు.తెలుగు సాహిత్యంలో ముద్రిత, అముద్రిత గ్రంథాల సూచీని తెలియచేసే గ్రంథాన్ని ప్రచురించాడు. భగవద్గీతకు ప్రామాణిక వ్యాఖ్యానాన్ని రచించాడు. పత్రికాధిపతిగా, దేశభక్తితత్పరుడిగా, దేశోద్ధారకుడిగా, విశ్వదాతగా, వితరణశీలిగా, జాతీయోద్యమ స్ఫూర్తిప్రదాతగా ఎనలేని సేవలందించిన మహనీయుడు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు. ఆయన 1938 మార్చి26వ తేదీన పరమపదించారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.





