
దీర్ఘకాలం నుంచి అనేక తరాలు ఎదురుచూస్తూ వచ్చిన అంశాలపై తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని, నిరీక్షణలకు తెరదించినట్లు సగర్వంగా చెప్పగలమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. 370వ అధికరణం రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు, తక్షణ ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణించడం వంటి ఎన్నో నిర్ణయాలను 17వ లోక్‌సభ తీసుకుందని, సభ్యులంతా ఈ విషయంలో విలువైన సేవలు అందించినందుకు యావద్దేశం దీవిస్తుందని చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణంపై.. బడ్జెట్ సమావేశాల చివరిరోజైన శనివారం పార్లమెంటు ఉభయసభల్లో చర్చ చేపట్టారు. లోక్‌సభలో ప్రధాని ప్రసంగిస్తూ- సమూల మార్పుల్ని తీసుకువచ్చే ఎన్నో ఘనమైన సంస్కరణలు తమ హయాంలో తీసుకురావడం ద్వారా బలమైన భారత్‌కు గట్టి పునాదులు వేశామని చెప్పారు. రామాలయంపై చర్చ భవిష్య తరాలకూ ముఖ్యమని, దేశ విలువలపై అవి గర్వపడేలా రాజ్యాంగబద్ధమైన బలాన్ని లోక్‌సభ తీర్మానం అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ సామర్థ్యం అందరికీ ఉండదు
పెను సవాళ్లు ఎదుర్కొనేందుకు దేశం దూసుకుపోతున్న తరుణాన.. గత అయిదేళ్లకాలంలో ‘సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణ’ (రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్‌ఫామ్)లపై తాము దృష్టి సారించినట్లు ప్రధాని చెప్పారు. ‘‘..ఇవన్నీ చేసే సామర్థ్యం అందరికీ ఉండదనేది వాస్తవం. కొందరే వీటిని ధైర్యంగా ఎదుర్కోగలరు. మిగిలినవారంతా రణక్షేత్రం నుంచి పలాయనం చిత్తగిస్తారు. ఈరోజు చేసిన ప్రసంగాలు రికార్డుల్లో నిలిచిపోతాయి. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ అనే మంత్రాన్ని ఇవి మున్ముందుకు తీసుకువెళ్తాయి. ఆటంకాలు ఎదురైనా అభివృద్ధి ఆగలేదు. సవాళ్లపై దేశానికి తగిన దిశానిర్దేశం చేశాం. ట్రాన్స్‌జెండర్లకూ సాధికారత కల్పించి, వారిలో ఒకరికి పద్మ పురస్కారం అందించాం. బ్రిటిష్‌కాలం నాటి చట్టాలు మార్చాం. రాబోయే ఎన్నికలు భారత ప్రజాస్వామ్య వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. ఎంపీలకు, స్పీకర్ ఓంబిర్లాకు నా కృతజ్ఞతలు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముఖంపై చిరునవ్వు చెదరకుండా, నిష్పాక్షికంగా సభను హుందాగా నడిపిన ఓంబిర్లా ప్రశంసనీయులు. సహనంతో అన్నింటినీ ఆయన ఎదుర్కొన్నారు. కరోనా మహమ్మారి చుట్టుముట్టిన సమయంలోనూ పార్లమెంటు కార్యకలాపాలకు భంగం కలగకుండా ఆయన ఏర్పాట్లు చేశారు. రాయితీపై క్యాంటీన్‌లో ఎంపీలకు అందే సదుపాయాల మీద విమర్శలు వస్తుండడంతో వాటినీ స్పీకర్ తొలగించారు. 97% ఉత్పాదకతను ఈ లోక్‌సభ సాధించింది. 18వ లోక్‌సభలో దీనిని 100 శాతానికి చేర్చే సంకల్పంతో ముందడుగు వేద్దాం’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.
నవభారత ప్రస్థానానికి అయోధ్య నాంది: అమిత్‌షా
హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ- అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో నవ భారత ప్రస్థానానికి నాంది పడిందన్నారు. వేల సంవత్సరాల పాటు ‘జనవరి 22’ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ‘‘రామమందిర ఉద్యమ ఘట్టం లేకుండా చరిత్రను చదవలేరు. 1528 నుంచి ప్రతి తరం ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమాన్ని చూసింది. విశ్వాసాలతో ముడిపడిన అంశంపై మరే దేశంలోనూ మెజారిటీ వర్గం ఇంత దీర్ఘకాలం నిరీక్షించి ఉండదు. శ్రీరాముడు లేని భారతాన్ని ఊహించుకునేవారికి దేశం గురించి పూర్తిగా తెలియదు. దేశ సంస్కృతిని, రామాయణాన్ని విడదీసి చూడలేం. వారు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) ఇంకా వలసవాద రోజుల్లోనే ఉన్నారు. భాజపా చర్యల వెనుక ఎన్నికల ఉద్దేశాల్లేవు’’ అని స్పష్టీకరించారు.
ఏక్‌భారత్..శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ప్రతీక: స్పీకర్
నాలుగున్నర గంటలపాటు జరిగిన చర్చ తర్వాత తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ప్రతీకంగా అయోధ్య ఆలయం నిలుస్తుందని, ఆ నిర్మాణం చరిత్రాత్మక విజయమని స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. ఆలయ నిర్మాణం ఒక చరిత్రాత్మక విజయమన్నారు. మోదీ సర్కారు కేవలం హిందుత్వ కోసమే ఉందా అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలు తాము వేరుపడినట్లు భావిస్తున్నారని, భారత్‌కు ‘మోదీ బాబా’ అవసరం లేదని చెప్పారు. అయోధ్యపై చర్చకంటే ముందు తమిళనాడు మత్స్యకారుల అంశాన్ని చర్చించాలంటూ రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన డీఎంకే ఎంపీలు.. దానికి సభాపతి అంగీకరించకపోవడంతో వాకౌట్ చేశారు. రాజకీయాలకు మతం రంగు పులిమే క్రతువులో తాము భాగస్వాములం కాబోమంటూ సీపీఎం ఈ చర్చలో పాల్గొనలేదు.
కాంగ్రెస్ ఉంటే ఆలయం వచ్చేదే కాదు: సారంగి
ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండి ఉంటే అయోధ్యలో రామాలయం ఏనాటికీ వచ్చేదే కాదని భాజపా ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగి చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. ‘అది నిజంగా రాముడి జన్మస్థలమేనా, దానిని ఆధారం ఉందా అని కొందరు అడుగుతుంటారు. మరి మీ పుట్టుకకు సాక్ష్యమేమిటి? మీ అమ్మానాన్నలను అలా పిలిచేముందు మీ డీఎన్‌యే పరీక్ష చేసుకున్నారా?’ అని ప్రశ్నించారు. సీతాదేవి జన్మస్థలంలో సీతామందిరాన్ని నిర్మించాలని జేడీయూ ఎంపీ రాంప్రీత్‌సింగ్ కోరారు. అయోధ్యలో పోలీసు కాల్పుల్లో కరసేవకులు ప్రాణాలు కోల్పోవడంపై కాంగ్రెస్ ఇంతవరకు ఎందుకు విచారం వ్యక్తం చేయలేదని కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి ప్రశ్నించారు.
..అందుకే కాంగ్రెస్‌కి ఆ పరిస్థితి: సత్యపాల్
చర్చను కేంద్ర మాజీమంత్రి, భాజపా ఎంపీ సత్యపాల్‌సింగ్ ప్రారంభిస్తూ- రాముడి అస్థిత్వాన్ని ప్రశ్నించినందుకే కాంగ్రెస్ పార్టీ విపక్ష స్థానానికి పరిమితమైందన్నారు. ప్రాణప్రతిష్ఠతో దేశ ఆత్మ జాగృతమైనట్లయిందని చెప్పారు. కొంతమంది భావిస్తున్నట్లుగా అయోధ్య ఆలయమంటే మతపరమైన అంశం కాదని స్పష్టం చేశారు. రామరాజ్యమంటే అందరూ ఆనందంగా ఉండాలని, ప్రస్తుతం దేశంలో బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు అలా ఉన్నాయా అని కాంగ్రెస్‌పక్ష ఉప నేత గౌరవ్ గొగొయ్ ప్రశ్నించారు. జై శ్రీరాం అని అంటూనే భాజపా నేతలు ద్వేషాన్ని, కోపాన్ని పెంచుతున్నారని, గుండెనిండా అలాంటి భావన ఉన్నవారు రామభక్తులు కాదని వ్యాఖ్యానించారు.





