News

అధ్వాన దారుల్లో.. అంతర్వేది వెళ్లేదెలా..?

312views

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు సమీపిస్తున్నాయి.. ఇటు చూస్తే రహదారులు అధ్వానంగా ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే మండలంలోని వివిధ గ్రామాల నుంచి అంతర్వేది వచ్చే రహదారులు అధ్వానంగా మారాయి. కాలువలకు కల్వర్టులు లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ఈనెల 16వ తేదీ నుంచి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మలికిపురం నుంచి కేశవదాసుపాలెం మీదుగా ఆలయానికి చేరుకునే దండుపుంత, ప్రధాన రహదారి గుంతలతో చిధ్ర]మై వాహనదారులు ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా మారాయి. సఖినేటిపల్లి మూడు తూముల నుంచి ఆలయానికి వచ్చే రహదారికి అంతర్వేదికర, గుడిమూల వంతెనకు, పలు ప్రదేశాల్లో కాలువలకు కల్వర్టులు, రక్షణగోడలు లేకపోవడంతో ప్రయాణికుల పట్ల శాపంగా మారాయి.

ఏమాత్రం అదుపుతప్పినా కాలువలోకి పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. స్వామివారి దర్శనానికి సుమారు 4లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. వీరందరూ ఈ రహదారులనే వినియోగించాల్సి ఉంది. అధికారులు ఉత్సవాల సమీక్షా సమావేశాల్లో రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని సూచించారు. తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తున్నారని కొన్ని రహదారులను పూర్తిగా వదిలేస్తున్నారని భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి రహదారులను వెంటనే బాగు చేయాలని, వంతెనలకు రక్షణ గోడలు, కవచాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దీనిపై ర.భ.శాఖ జేఈ సురేష్‌ను వివరణ కోరగా ఉత్సవాల నాటికి మరమ్మతులు చేస్తామని వెల్లడించారు.