News

హథీరాంబాబా భూముల విక్రయంపై సుప్రీం స్టేటస్ కో

296views

తిరుపతిలోని 25 ఎకరాల హథీరాంబాబా మఠం భూముల విక్రయంపై సుప్రీం కోర్టు యథాతథ స్థితి (స్టేటస్కో) విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్పీ ఎన్ భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మఠం భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడలేమని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం వాటిని విక్రయించాలని గతంలో నిర్ణయించింది. లీజుకు తీసుకున్నవారే కొనుగోలు చేయడానికి వీలు కల్పించింది. దానిపై మఠం ఏపీ హైకోర్టును ఆశ్ర యించగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ మఠం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడటం కష్టమన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో సుప్రీంకోర్టు విభేదించింది. ఢిల్లీ నుంచి తిరుపతి వరకు ఉన్న రూ.కోట్ల విలువ చేసే మఠం భూములు అన్యాక్రాంతం అవుతుండటంపై విచారం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అభిప్రా యపడింది. తదుపరి విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు మఠం భూములను అమ్మడానికి వీల్లేదంటూ యథాతథ స్థితి విధించింది.