ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 10 ; వేదాంతం కమలాదేవి

485views

కాలగర్భంలో కలిసిపోయిన స్ఫూర్తిదాతల్లో ఒకరు వేదాంతం కమలాదేవి. స్వాతంత్య్ర సమరయోధురాలిగా, తొలితరం మహిళా రాజకీయవేత్తగా తనదైన ముద్ర వేశారామె. దేశక్షేమం కోసం ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ‘దేశ సేవిక’ బిరుదును సైతం అందుకున్నారు. వేదాంతం కమలాదేవి గొప్ప దేశభక్తురాలు, కడపజిల్లా రాజంపేట తాలూకా నందలూరులో 1897 మే 5వ తేదీన జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య, భ్రమరాంబ. నందలూరులోనే ఆమె బాల్యం గడిచింది. బాల్య వివాహాలు జరుగుతున్న రోజులవి. అందుకే పన్నెండవ ఏటనే వేదాంతం కృష్ణయ్యతో ఆమె వివాహం జరిగింది. కృష్ణయ్య వైద్య విద్యార్ధి కలకత్తాలోని మెడికల్ కాలేజీలో చదువుకొంటూ ఉండేవారు. భర్తకు తోడుగా ఉండడానికి, కమలాదేవీ కలకత్తా వెళ్లిపోయింది. అప్పట్లో కలకత్తాలో సుప్రభాదేవి అనే సామాజిక కార్యకర్త ఉండేవారు. దేశప్రజల కోసం అనేక రకాలుగా సేవ చేస్తుండేవారు సుప్రభాదేవి. ఆమెతో పరిచయం కావడం, అది గట్టి అనుబంధంగా మారడం జరిగింది. ఆనాటినుండీ, స్వాతంత్య్ర పోరాటంలో ప్రవేశించింది కమలాదేవి. ముఖ్యంగా కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం, అమాయకులైన గ్రామీణ స్త్రీలకు సహాయపడడం తన జీవనమార్గంగా మలచుకొన్నదామె.

కృష్ణయ్యది తూర్పుగోదావరిలోని కాకినాడ పట్టణం. వైద్యవిద్య పూర్తి అయ్యాక. కాకినాడ తిరిగివచ్చి, స్వయంగా ప్రాక్టీసు ప్రారంభించారు. కమలాదేవి కాకినాడలో, దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ సాహచర్యంలో విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాట్నంమీద నూలుతీయడం ఆమె నిత్యకృత్యమయ్యింది. ఖద్దరు ప్రచారంలో భాగంగా, ఎన్నో గ్రామాలు తిరిగారు. కమలాదేవి కృషి, పట్టుదల గురించి ప్రజలకు పెద్దలకూ తెలిసింది. తిలక్ స్వరాజ్యనిధికి విరాళాలు సేకరించడానికి ఆమె ఎంతో శ్రమించారు. ఎంతో కష్టపడి సేకరించిన మొత్తాన్ని గాంధీజీకి అందించారు. మహాత్ముడు ఆమెను ప్రశంసించారు కూడా.

కాకినాడ పట్టణ చరిత్రలో ఒక గొప్ప ఘట్టం 1923లో జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు కాకినాడ పట్టణం వేదికయ్యింది. దేశం నాల్గుమూలల నుండీ పెద్దలు విచ్చేశారు. వారిలో ఎందరో మహిళలున్నారు. అంతేకాక, సభల్ని దర్శించడానికి వచ్చిన మహిళలు అసంఖ్యాకంగా ఉన్నారు. అందువల్ల మహాసభల్లో మహిళా కార్యకర్తల అవసరం ఎంతో ఏర్పడింది. ఆ కార్యకర్తలు అందర్నీ క్రమపద్ధతిలో నడిపించే బాధ్యతను, కమలాదేవికి అప్పగించారు. కమలాదేవి లేడీ కమాండెంట్ (మహిళాదళానికి నాయకురాలు)గా నియమితులయ్యారు. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను ఆమె ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు.

దేశమంతా ఉప్పు సత్యాగ్రహం ఉదృతంగా సాగుతున్న కాలంలో నౌపడ దగ్గర ఉప్పు సత్యాగ్రహ ఆందోళనలో పాల్గొన్నారామె. 20-5-1930న బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి, రాయవెల్లూరు జైలులో ఆరునెలలు శిక్ష విధించింది. జైలు నుండి విడుదలయ్యాక, మరింత ఉత్సాహంతో దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ సమావేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియనీయకుండా గుంటూరులో ఓ తెల్లవారుఝామున నిర్వహించారు. దాంతో ఆగ్రహించిన పర ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి జైలుశిక్ష వేసింది. ఈసారీ రాయవెల్లూరులోనే మరో ఆరునెలల జైలుశిక్ష అనుభవించారు. ఢిల్లీ నగరంలో సరోజినీ నాయుడు ఒక జాతీయ మహాసభ నిర్వహించారు. కమలాదేవి ఢిల్లీ వెళ్లి, ఆ సభలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వ దుర్మార్గాలను తీవ్రంగా విమర్శించారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ స్త్రీ చేసింది. మూడుసార్లు కాకినాడ మున్సిపల్ కౌన్సిలర్ సేవలందించారు. కాంగ్రెస్ స్థాయీ సంఘం సభ్యురాలిగానూ పనిచేశారు.

స్వాతంత్ర్యోద్యమంతో పాటు స్త్రీల అభ్యుదయం కోసం ఆమె ఎంతో కృషి చేశారు. అనుకోని పరిస్థితులలో ఆమెకు పక్షవాతం వచ్చింది. అయినా ఆమె భయపడకుండా, అలాగే కష్టపడి పనిచేశారు. చివరికి తన ఇంటినే అనాథ శరణాలయంగా మార్చి, అనాథలకు సేవ చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనడంతోపాటు దేశాభ్యున్నతి కోసం తన వంతు సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను ‘దేశ సేవిక’ బిరుదు పొందారు వేదాంతం కమలాదేవి. తన జీవితమంతా దేశం కోసమే అర్పించిన వేదాంతం కమలాదేవి తన నలభై మూడవ ఏట, 1940 జూలై 14వ తేదీన పక్షవాతంతో కన్నుమూశారు.