News

శ్రీకాళహస్తీశ్వరాలయం చుట్టూ పొంచి ఉన్న భద్రతా వైఫల్యం

296views

చిత్తూరు జిల్లాలో ప్రముఖ శైవారామంగా ఖ్యాతి గడించిన శ్రీకాళహస్తీశ్వరాలయం చుట్టూ పొంచి ఉన్న భద్రతా వైఫల్యం మరోదఫా చర్చనీయాంశంగా మారింది. పట్టణానికి చెందిన 14 ఏళ్ల బాలుడు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తిరుమంజన గోపురం వద్ద బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల కోసం సిద్ధం చేసిన కర్రలు, నిచ్చెన సాయంతో రూ.750 రాహు, కేతు పూజలు నిర్వహించే నగరి కుమారుల మండపం ద్వారా ఆలయ ఆవరణలోనికి ప్రవేశించాడు. ఆలయంలోని పొగడచెట్టు, రూ.500 రాహు, కేతు మండపం పరిసర ప్రాంతాల్లో తిరిగాడు. నాలుగు గంటల సమయంలో వచ్చిన దారిలో కిందకు దిగుతుండగా అక్కడ లాడ్జిల వద్ద పనిచేసే వాళ్లు గమనించి ఆ బాలుడ్ని పోలీసులకు అప్పగించారు. ఇంత భద్రతా వ్యవస్థ ఉండీ సిబ్బంది గుర్తించకపోవడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి.

అప్పట్లోనే మూడంచెల వ్యవస్థ
రాజుల కాలంలోనే ముక్కంటి ఆలయం చుట్టూ మూడంచెల భద్రతను అందుబాటులోకి తీసుకువచ్చారు. గర్భ, ఉపాలయాలు, ప్రాకారం, మహా ప్రాకారాలుగా ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. మహా ప్రాకారాన్ని ఆనుకుని నాలుగు ప్రవేశ గోపురాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా వీటి నుంచి ప్రవేశించాల్సిందే. గతంలో జరిగిన పలు ఘటనలు దృష్ట్యా ఎస్పీఎఫ్‌, ఏఆర్‌, హోంగార్డు, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో ఆలయ శాశ్వత భద్రతకు శ్రీకారం చుట్టారు.
లోపాలు పరిశీలిస్తే…

  • ఆలయ మహా ప్రాకారానికి ఇప్పటి వరకు సౌర కంచె ఏర్పాటు చేయకపోవడం.
  • ఆలయం పైభాగంలో ప్రస్తుతం ఏఆర్‌ కానిస్టేబుల్‌, హోంగార్డు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పర్యవేక్షిస్తుంటే, మహద్వారం వద్ద నలుగురు ఎస్పీఎఫ్‌ ఉద్యోగులు పహరా కాస్తున్నారు. మహద్వారం దగ్గర అందరూ ఉండటం కంటే ఎస్పీఎఫ్‌ ఉద్యోగులు పైభాగంలో గస్తీ ఉంటే మరింత అప్రమత్తంగా ఉండచ్చు.
  • రాత్రివేళల్లో ఆలయ భాగాలను చూపుతూ దీపాల ఏర్పాటు లేకపోవడం.