News

కంచె వేయడంతో వాహనదారులకు, భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు

203views

రాష్ట్రంలోనే రెండో పెద్ద ఆలయమైన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లాలంటే వాహనదారులకు, భక్తులకు కష్టాలు తప్పడం లేదు. కృష్ణానది వద్ద దుర్గాఘాట్‌లో స్నానాలు ఆచరించిన భక్తులు ఇంద్రకీలాద్రిపైకి కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. దుర్గాఘాట్‌ ముందు ఆరు నెలల కిందట పెద్దఎత్తున కొండరాళ్లు జారిపడి పెనుప్రమాదం తప్పింది. ఆ రాళ్లను తొలగించి మళ్లీ జారిపడకుండా చర్యలు చేపట్టాల్సిన అధికారులు అవేవీ చేయకుండా.. అటువైపుగా ఎవరూ రావొద్దనేలా.. ఓ ఇనుప కంచెను వేసి చేతులు దులిపేసుకున్నారు. గత దసరా వేడుకల సమయంలో తాత్కాలికంగా ఈ కంచెను వేస్తున్నామన్నారు. వేడుకలు ముగిసి ఐదు నెలలు దాటినా కంచె మాత్రం తీయలేదు. కొండరాళ్లు, ప్రమాదకరంగా వాలిన రాళ్లను తొలగించే పనులు త్వరితగతిన చేసి.. భక్తులకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాల్సి ఉన్నా.. పాలక మండలి, ఈవో ఆ చర్యలు చేపట్టడం లేదు. ఈ దారిలో నిత్యం భక్తులు, మంత్రులు, అధికారులు వెళ్లి వస్తుంటారు. హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు, నగరంలోని వాహనాలు ఒకేసారి వస్తుండడంతో రహదారి ఇరుకుగా మారి నిత్యం ట్రాఫిక్‌ కష్టాలు ఎదురవుతున్నాయి.