
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో వెంకన్న సన్నిధి కళకళలాడుతూ ఉంటుంది. హిందూ భక్తులతో పాటు అన్యమతస్థ భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే దీనికి ఓ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తిరుమలకు వచ్చే హిందూయేతరులు.. ‘‘మాకు శ్రీవారిపై సంపూర్ణ నమ్మకం ఉంది’’ అంటూ డిక్లరేషన్ సమర్పించి స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే శ్రీవారి సేవలో పాల్గొంటామంటూ ఇటీవల అన్యమతస్థ భక్తుల నుంచి టీటీడీకి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. వెంకన్న సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని టీటీడీని హిందూయేతర భక్తులు కోరుతున్నారు.
త్వరలోనే అనుమతి…
ఈ నేపథ్యంలో అన్యమతస్థుల శ్రీవారి సేవకు సంబంధించి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. త్వరలోనే ఆఫ్‌లైన్‌లో అన్యమతస్థ భక్తులను శ్రీవారి సేవకు అనుమతిస్తామని టీటీడీ ఈవో ప్రకటించారు. అన్యమతస్థ భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సెక్యూరిటీ విభాగం సూచనల మేరకు అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలా మంది హిందూయేతర భక్తులు వెంకన్నకు సేవ చేసేందుకు అనుమతివ్వాలని టీటీడీకి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. ఓ కమిటీని నియమించి వారీ సూచనల మేరకు అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించడంపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో తెలిపారు.





