News

కక్ష్యలో సత్తా చాటిన ‘హరిత’ చోదక వ్యవస్థ

272views

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ‘హరిత’ చోదక వ్యవస్థ.. భూ కక్ష్యలో విజయవంతంగా తన సత్తా చాటిందని రక్షణ శాఖ తెలిపింది. అంతరిక్ష రక్షణ పరిజ్ఞానంలో ఇది పెద్ద ముందడుగు అని పేర్కొంది. ఈ చోదక వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలెప్‌మెంట్‌ ఫండ్‌ (టీడీఎఫ్‌) కింద రూపొందించారు. దీనివల్ల భూ దిగువ కక్ష్యలో విషతుల్యం కాని, పర్యావరణ అనుకూల చోదక వ్యవస్థను ఉపయోగించడానికి వీలైందని అధికారులు వివరించారు.

ఈ ప్రాజెక్టు కిందట ఒక న్యూటన్‌ శ్రేణి హరిత మోనోప్రొపెల్లెంట్‌ థ్రస్టర్‌ను అభివృద్ధి చేశారు. ఈ బాధ్యతను బెంగళూరుకు చెందిన బెల్లాట్రిక్స్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేపట్టింది. ఈ సంస్థకు డీఆర్‌డీవో మార్గనిర్దేశం చేసింది. ఈ థ్రస్టర్‌ను పీఎస్‌ఎల్‌వీ సి-58 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఒక మైక్రో ఉపగ్రహానికి అమర్చారు. శాటిలైట్‌ను నిర్దిష్ట కక్ష్యలో ఉంచడానికి ఈ ఇంజిన్‌ సాయపడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఇస్ట్రాక్‌ కేంద్రం ద్వారా సేకరించిన దీని డేటాను శాస్త్రవేత్తలు తాజాగా పరిశీలించారు. అన్ని అంశాల్లోనూ ఈ హరిత చోదక వ్యవస్థ తమ అంచనాలకు మించి పనిచేసిందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద దేశీయంగా ఇంధనం, ఫిల్‌ అండ్‌ డ్రెయిన్‌ వాల్వ్‌లు, డ్రైవ్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితర వ్యవస్థలను అభివృద్ధి చేశారు.