News

షాహీ ఈద్గా ప్రాంగణ సర్వేపై స్టే కొనసాగుతుంది: సుప్రీం

518views

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం చెంతనున్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో కోర్టు పర్యవేక్షిత సర్వేకు, సర్వే కమిషనర్‌ నియామకానికి అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వుల అమలుపై గతంలో తామిచ్చిన మధ్యంతర నిలిపివేత (స్టే) ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. షాహీ ఈద్గా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్‌ రెండో వారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో భాగస్వాములైన పక్షాలు తమ వాదనలను అప్పటికల్లా సమర్పించాలని ఆదేశించింది. ఇదే అంశంపై దాఖలైన అన్ని కేసులను ఏప్రిల్‌లోనే విచారణకు చేపడతామని ధర్మాసనం తెలిపింది.