News

అయోధ్య రామయ్య.. ఇక ‘బాలక్‌ రామ్‌’గా దర్శనం

262views

శతాబ్దాల స్వప్నం సాకారమై అయోధ్యలోని నవ నిర్మిత భవ్య మందిరంలో రామయ్య కొలువుదీరాడు. ప్రధాని చేతులమీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక చూసి భక్తజనం పులకించిపోయింది. అయితే, ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన రామ్‌లల్లాను ఇకపై ‘బాలక్‌ రామ్‌’గా పిలవనున్నారు. ఈ మేరకు ట్రస్ట్‌ పూజారి అరుణ్‌ దీక్షిత్‌ వెల్లడించారు.

‘‘జనవరి 22న ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి ‘బాలక్‌ రామ్‌’గా పేరు పెట్టాం. అయోధ్యలో కొలువుదీరిన రామచంద్రమూర్తి ఐదేళ్ల పసిబాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే ఈ పేరును నిర్ణయించాం. ఇకపై ఈ ఆలయాన్ని బాలక్‌ రామ్‌ మందిరంగా పిలుస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.

అయోధ్యలో మరో చరిత్రాత్మక ఘట్టం.. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం
రోజుకు ఆరుసార్లు హారతి..

మంగళవారం నుంచి బాలరాముడి దర్శనానికి సామాన్య భక్తులను అనుమతించారు. ఇక, ప్రాణప్రతిష్ఠ పూర్తవడంతో హారతి వేళలు, పూజా కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. రోజుకు ఆరుసార్లు హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రస్ట్‌కు చెందిన ఆచార్య మిథిలేశ్‌నందిని శరణ్‌ తెలిపారు. ప్రతిరోజూ మంగళ (నిద్ర లేపేందుకు), శ్రింగార (అలంకరణ సేవలో), భోగ (నైవేద్య సమర్పణ వేళ), ఉతపన్‌ (దిష్టి తగలకుండా), సంధ్యా (సాయంత్రం వేళ), శయన హారతి (స్వామి వారిని నిద్ర పుచ్చేందుకు) ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
నైవేద్యం ఇలా..

పూరి, కూరతో పాటు రబ్‌డీ-ఖీర్‌, పాలు, పండ్లు, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించనున్నారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాల్లో ‘బాలక్‌ రామ్‌’ దర్శనం ఇవ్వనున్నారు.