
దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసే వారు.. అవినీతి కారణంగా వ్యవస్థ కలుషితమవుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలదీశారు. దీపావళి వేడుకల్లో టపాసులు కాల్చడాన్ని ఆయన సమర్థించారు. బాణసంచా వల్ల తాత్కాలికంగా కొంత కాలుష్యం ఏర్పడినప్పటికీ, అది కొంతకాలానికి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. అయితే అవినీతి వల్ల వ్యవస్థ మొత్తం దెబ్బతింటున్నా కొందరు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
దీపావళి వేడుకలపై తమ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ప్రజలు పండుగను సంప్రదాయబద్ధంగా, పూర్తి ఉత్సాహంతో జరుపుకునేలా ప్రోత్సహించిందని యోగి తెలిపారు. ధన్తేరస్ సందర్భంగా రాష్ట్రంలోని మార్కెట్లలో కనిపించిన సందడి, ప్రజల ఉత్సాహం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన జూనియర్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను అయోధ్యలో ఉన్న సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతూ దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవడం చూశానని యోగి గుర్తుచేసుకున్నారు. 2017లో బీజేపీ అధికారంలోకి రాకముందు ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవని పేర్కొన్నారు. హోలీ, దీపావళి, విజయదశమి, జన్మాష్టమి, శివరాత్రి, క్రిస్మస్, ఈద్, గురుపర్వ్, మకర సంక్రాంతి వంటి పండుగల సమయంలో తరచూ మత ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకునేవని వ్యాఖ్యానించారు.





