News

దేశ నలుమూలల నుంచి అయోధ్య రామయ్యకు ప్రత్యేక కానుకలు

342views

నూట ఎనిమిది అడుగుల అగరుబత్తీ, 2,100 కిలోల గంట, 1,100 కిలోల పంచలోహ మహాదీపం, బంగారు పాదుకలు (హైదరాబాద్‌ నుంచి), 10 అడుగుల తాళంచెవులు, ఏకకాలంలో 8 దేశాల సమయం చూపించే గడియారం.. ప్రాణప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి అయోధ్య రామయ్యకు ఇలా ఎన్నో ప్రత్యేక కానుకలు అందుతున్నాయి. నేపాల్‌లోని సీతమ్మ జన్మస్థలి అయిన జనక్‌పుర్‌ నుంచి 30 వాహనాల్లో మూడు వేలకు పైగా కానుకలు తెచ్చారు. శ్రీలంక నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతినిధి బృందం వారి దేశంలో ఉన్న ‘అశోకవనం’ నుంచి శిలను తీసుకువచ్చింది.

గుజరాత్‌ నుంచి ధ్వజస్తంభాలతోపాటు స్వర్ణతాపడం చేసిన దాదాపు 5 అడుగుల ఢమరుకం వచ్చింది. నాగ్‌పుర్‌కు చెందిన షెఫ్‌ విష్ణు మనోహర్‌ ప్రాణప్రతిష్ఠ రోజున భక్తుల కోసం ఏడువేల కిలోల సంప్రదాయ వంటకం ‘రామ్‌ హల్వా’ సిద్ధం చేస్తానని ప్రకటించారు. మథురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్‌ సేవాసంస్థాన్‌ నుంచి యజ్ఞం కోసం 200 కిలోల లడ్డూలు పంపనున్నారు. తిరుపతిలోని తితిదే భక్తులకు పంపిణీ కోసం లక్ష లడ్డూలు పంపుతామని ప్రకటించింది. గుజరాత్‌లోని సూరత్‌ నుంచి సీతమ్మకు ప్రత్యేక చీర, కంఠహారం పంపారు. సుగంధ ద్రవ్యాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన యూపీలోని కన్నౌజ్‌ నుంచి ప్రత్యేక పరిమళ ద్రవ్యాలు, పన్నీరు అయోధ్యకు పంపుతున్నట్లు కన్నౌజ్‌ అత్తర్స్‌ అండ్‌ పర్‌ఫ్యూమ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పవన్‌ త్రివేది తెలిపారు.