News

పర్యాటక ప్రదేశంగా దశరథ మహారాజు సమాధి

304views

శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు మరణించిన తర్వాత ఆయనకు అయోధ్యలోనే దహన సంస్కారాలు నిర్వహించి సమాధి నిర్మించినట్లు తెలుస్తోంది. రామాలయం ప్రారంభం తర్వాత భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యలో ప్రాశస్త్యం ఉన్న ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తోంది. అందులో ఈ దశరథ్‌ సమాధి స్థల్‌ కూడా ఉంది. ఈ ప్రాంతం రామమందిరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరయు నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతాన్ని బిల్వహరి ఘాట్‌ అంటారని స్థానిక పూజారి మహంత్‌ దిలీప్‌ దాస్‌ చెప్పారు. ఇక్కడ దశరథుడిని దహనం చేసి ఆ చితాభస్మాన్ని సమాధిలో భద్రపరచారని వెల్లడించారు. ప్రస్తుతం రామమందిరం నుంచి బిల్వహరి ఘాట్‌కు చేరుకునేందుకు నాలుగు వరుసల రహదారిని ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇక్కడ దశరథుని సమాధితో పాటు రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుల పాద ముద్రలను తీర్చిదిద్దారు. లంక నుంచి రామలక్ష్మణులు తిరిగి వచ్చాక దశరథుని సమాధికి వచ్చి ఆశీస్సులను తీసుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.