News

ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష నుంచి ఉపశమనం

171views

గూఢచర్యం ఆరోపణల కేసులో భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బందికి ఖతర్‌లో పడిన మరణశిక్షను స్థానిక న్యాయస్థానం రద్దు చేసి జైలు శిక్షగా మార్చింది. ఈ మేరకు ఖతర్‌ కోర్టు తీర్పు ఇచ్చినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, వారికి ఎన్నేళ్ల శిక్ష విధించారన్నదానిపై స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై ఖతర్‌ అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బంది అల్‌ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతర్‌ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. సబ్‌మెరైన్‌ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో భారత్‌కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతర్‌ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. అనంతరం ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం.. ఆ ఎనిమిది మందికి మరణ శిక్ష విధిస్తూ ఈ ఏడాది అక్టోబరులో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ఎంఈఏ దోహాలో అప్పీలు దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు వారి మరణశిక్షను రద్దుచేసి జైలుశిక్ష విధించింది.

శిక్ష పడిన వారిలో కెప్టెన్లు సౌరభ్‌ వశిష్ఠ్‌, నవతేజ్‌ గిల్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాల, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్‌, సెయిలర్‌ రాగేశ్‌ ఉన్నారు. వీరిలో సుగుణాకర్‌ విశాఖ వాసి.