
తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుళ్లు జరిగాయి. అది కూడా మిలటరీ ఆసుపత్రిలో. రావల్పిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో భారీ పేలుడు సంభవించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ కూడా ఉన్నాడని చెబుతున్నారు. ఈ రాక్షసుడు గత కొద్ది రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటూ ఉన్నాడని నిఘా వర్గాలు కూడా గతంలో తెలిపాయి. ఈ బాంబు దాడిలో మసూద్ కు కూడా తీవ్రగాయాలయ్యాయా?అన్నది తెలియాల్సి ఉంది. రావల్సిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో భారీ పేలుడు జరిగిందని స్థానికులు అంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెడుతున్నారు. అయితే అక్కడి యంత్రాంగం మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. ఘటనా స్థలి వద్దకు వెళ్లేందుకు మీడియాకు కూడా ఆర్మీ అధికారులు అనుమతినివ్వలేదు. మసూద్ అజార్ తీవ్ర అనారోగ్యంతో ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసే దాడి చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.






