ArticlesNews

సమరసతా సాధనలో సఫలమవుతున్న ఎస్.ఎస్.ఎఫ్

1.3kviews

క ఎస్.సి కాలనీలోని దేవాలయంలో అదే కాలనీకి, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పూజారి, అర్చకస్వామిగా పొద్దున్నే దేవాలయాన్ని శుభ్రం చేసుకుని, స్వామికి ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆ తర్వాత యదావిధిగా కూలి పనులకు వెళ్ళిపోతారు. అయితే తాను సాయంత్రం సకాలానికి దేవాలయానికి వచ్చి పూజ చెయ్యలేడు. కనుక ఆ సమయంలో ఒక బ్రాహ్మణ అర్చక స్వామి ఆ విధులు నిర్వహిస్తారు. ఇది కడప జిల్లాలోని ఒక ఎస్.సి కాలనీలోని ఒక దేవాలయంలో కనిపిస్తున్న దృశ్యం. గత నాలుగైదు సంవత్సరాలుగా సమరసతా సేవా ఫౌండేషన్ కృషి కారణంగా సమాజంలో వెల్లివిరుస్తున్న సమరసతకు ఈ సంఘటన ఒక నిదర్శనం.

సమరసతా సేవా ఫౌండేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ధిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో 500ల చోట్ల ఎస్.సి, ఎస్.టి, మత్స్యకార కాలనీలలో దేవాలయాలను నిర్మించింది. ఈ నిర్మాణ బాధ్యతను స్థానికులే భుజాన వేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయా కాలనీలలోని సామాజిక వర్గాల నుండే యువకులను ఎంపిక చేసి వారికి అర్చక శిక్షణను ఇచ్చింది. ఈ దేవాలయాల కేంద్రంగా ఇప్పటికి 90 చోట్ల తితిదే “శ్రీనివాస కళ్యాణ ఉత్సవాలను” నిర్వహించింది. దేవాలయాల నిర్మాణంలో ఆర్ధిక సహకారం, దేవాలయాల ప్రారంభోత్సవ సమయంలో, శ్రీనివాస కళ్యాణోత్సవాల సమయంలో అన్ని కులాల వారూ సహకరించారు, పాల్గొన్నారు కూడా. ఇతర కులాలకు చెందిన భక్తులు సైతం అనేకమంది ఈ దేవాలయాలకు వస్తున్నారు. ఈ అర్చక స్వాములను ఇతర కులాల వారు అందరూ గుర్తించి గౌరవిస్తున్నారు. ఈ దేవాలయాల కేంద్రంగా సామాజిక సమరసత వెల్లివిరుస్తోంది.

గుడి కేంద్రంగా బడి :

నూతన దేవాలయాలు నిర్మాణమైన ఎస్.సి, ఎస్.టి, మత్స్యకార కాలనీలలో షుమారు 50 ఎంపిక చేసిన కాలనీలలో హై స్కూలుకు వెళ్ళే బాలబాలికలకు, స్కూలుకు వెళ్ళడానికి అవకాశం లేని 6 – 13 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు రోజూ రెండు గంటల పాటు సాయంత్రం పాఠశాలలను ప్రారంభించ తలపెట్టింది ఎస్.ఎస్.ఎఫ్. వీటిలో చదువు, ఆటపాటలతోపాటు దైవ భక్తిని, దేశ భక్తిని కూడా ప్రబోధిస్తారు. ఆయా కాలనీల నుండి ఇంటర్ చదివిన యువతీ యువకులను గుర్తించి వారికి ఏప్రిల్ 28,29 తారీఖులలో రెండు రోజుల పాటు తర్ఫీదు ఇచ్చారు. మే 29 నుంచి ఈ కేంద్రాలలో సాయంత్రం పాఠశాలలు ప్రారంభమయ్యాయ్. వినాయక చవితి నాటికి మరో 150 పాఠశాలలను ప్రారంభించాలని ఎస్.ఎస్.ఎఫ్ సంకల్పించింది. ఈ ఉపాధ్యాయులకు అవసరమైన తర్ఫీదునివ్వటం కోసం ముగ్గురు ఉపాధ్యాయులతో జిల్లాల వారీ కమిటీలను వేసింది. గిరిజనులు ఎక్కువగా వుండే నాలుగు గిరిజన డివిజన్లలో ప్రత్యెక వ్యవస్థను ఏర్పాటు చేసింది.