News

తిరుమల అన్న ప్రసాదం నాణ్యతపై వివాదం

279views

తిరుమలలో నిత్యాన్నదానంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత సరిగ్గా లేదంటూ పలువురు భక్తులు టీటీడి సిబ్బందిపై తిరగబడ్డారు. సోమవారం రాత్రి కొందరు అయ్యప్ప స్వాములు, సాధారణ భక్తులు అన్నదాన కేంద్రానికి వచ్చారు. సిబ్బంది వడ్డించిన అన్నప్రసాదం ఉడకలేదని, మరికొంత ముద్దగా ఉందని చెబుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘అసలు ఇది అన్నమా.. ఎవరూ తినలేకపోతున్నారు. మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఆకుల్లో వదిలేశారో.. దారుణంగా ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదానం సూపరింటెండెంట్‌, ఏఈవోను పిలవాలంటూ గొడవకు దిగారు. చలికి అన్నం ఆరిపోయి అలా అయ్యిందని ఉద్యోగి చెప్పగా, భక్తులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. రూ.కోట్లలో కానుకలు సమర్పిస్తుంటే నాణ్యమైన అన్నం అందించలేరా అంటూ మహిళలు ప్రశ్నించారు. అన్నప్రసాదాలను వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో భోజనంపై భక్తులు మండిపడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భోజనం నాణ్యత నాసిరకంగా ఉందంటూ భక్తులు మండిపడుతున్నారు.

తరచూ ఫిర్యాదులు.. మిల్లర్ల నుంచి కొనుగోలేదీ?
అన్నప్రసాదం నాణ్యతపై టీటీడి అధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. టీటీడి డయల్‌ యువర్‌ ఈవో, సోషల్‌ మీడియా వేదికగా కొందరు ఇదే విషయమై తరచూ ప్రస్తావిస్తుండటంతో ప్రస్తుత గుత్తేదారుల నుంచి కాకుండా మిల్లర్ల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయాలని టీటీడి పాలకమండలి నిర్ణయించింది. ఆ దిశగా ఇంకా అడుగులు పడలేదు. బియ్యం నుంచి నిత్యావసర సరకుల వరకు ల్యాబ్‌లో తనిఖీ చేయిస్తామని టీటీడి చెబుతున్నా… నాణ్యతపై విమర్శలు తప్పడం లేదు.

అత్యున్నత ప్రమాణాలు: టీటీడి ఛైర్మన్‌
తిరుమలకు రోజూ వచ్చే భక్తులకు అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. భక్తుల గొడవ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడి ప్రథమస్థానంలో నిలుస్తోందన్నారు. కొందరు మాత్రమే మిగిలిన భక్తులను రెచ్చగొట్టేలా మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందన్నారు. పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు.