
కార్తిక సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ అధికారుల తీరుతో ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఉచిత, రూ.50, రూ.100, 200 టికెట్లతో వేర్వేరు దర్శన వరుసలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం రూ.50 దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ఆ వరుసకు కూడా రూ.100 టికెట్‌గా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇది చాలదన్నట్లు ఉచిత దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందని.. రూ.100, 200 టికెట్లు తీసుకొంటే స్వామిని త్వరగా దర్శించుకోవచ్చని మైక్ ద్వారా ప్రచారం చేశారు. జోరు వర్షం కురుస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గత్యంతరం లేక ఆ టికెట్లు తీసుకుని దర్శనానికి వెళ్లారు. ఈ పరిస్థితిపై సామాన్య భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వర్షంతో ఇబ్బంది పడుతున్న భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఆలయ అధికారులు ఇలా వ్యాపార ధోరణి ప్రదర్శించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జోరు వానలోనూ పోటెత్తి..
కార్తిక సోమవారం సందర్భంగా గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రధానార్చకులు స్వామికి అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తుపాను ప్రభావంతో ఈదురుగాలులు, వర్షం కొనసాగుతున్నా భక్తుల తాకిడి తగ్గలేదు. ఆలయం ఎదుట దర్శనం క్యూల వద్ద వాననీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 25 వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.





