
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ భారీ విజయం దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి.. హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. మధ్యప్రదేశ్‌లో అఖండ మెజార్టీతో కమలనాథులు ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఇక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించి భాజపా అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమైంది.
రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని పునరావృతం చేస్తూ.. తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందనే అభిప్రాయాలు వినిపించగా.. అనూహ్యంగా బీజేపీ విజయఢంకా మోగించింది.





