
దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయంటూ పాకిస్థాన్ హెచ్చరించింది. ఈ సమాచారాన్ని భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)కు పాకిస్థాన్ అందజేసింది. రాబోయే రోజుల్లో సౌత్ కశ్మీర్‌లోని జాతీయ రహదారిపై ఉగ్రదాడి జరిగే అవకాశముందని ఎన్ఎస్ఏకు పాకిస్థాన్ సమాచారమిచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అల్‌ఖైదా ఇండియా కమాండర్ జాకిర్ ముసా సహా పలువురు కమాండర్లను ఉగ్రవాద ఏరివేత చర్యల్లో భాగంగా భారత భద్రతా బలగాలు మట్టుబెట్టినందుకు ప్రతీకారంగా లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి టెర్రరిస్టు గ్రూపులు ఈ దాడులు జరిపేందుకు సిద్ధమవుతున్నాయని పాక్ హెచ్చరించింది. అవంతపుర సమీపంలోని ఓ వాహనంలో అత్యంత అధునాతన పేలుడు పదార్ధాన్ని ఉంచి దాడి జరపొచ్చని సంకేతాలిచ్చింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
కాగా, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి పుల్వామా జిల్లాలోనే ఏ సమయంలోనైనా ఉగ్రదాడులు జరగొచ్చన్న హెచ్చరికలతో సరిహద్దుల్లోని అన్ని కీలక ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా, పెట్రోలింగ్‌ను పెంచడంతో పాటు, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు.





