ArticlesNews

ఆంధ్ర గణిత శాస్త్రజ్ఞులు

378views

ఎందరో భారతీయ శాస్త్రజ్ఞులు, గణిత మేధావులూ, కళాకారులూ, పండితులూ రకరకాల రంగాలలో విశేషమైన కృషిచేసి మానవాళికి ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు, పరిశోధనలు చేశారు. ప్రాచీన,వేద కాలం నుండి పెంపొందింపబడిన మన జ్ఞాన సంపద యొక్క ఆ యజ్ఞంలో ఋషులూ, ఆచార్యులే కాక చాలామంది సామాన్యులు ఉన్నారు. వేద కాలం నుండి నేటి ఆధునిక ఆవిష్కరణల దాకా ఎందరో మహానుభావుల కృషి ఉంది. ఈ పరంపరలో మన ఆంధ్రులు కూడా ఎంతోమంది ఉన్నారు. వారిలో అన్ని రంగాల వారు ఉన్నారు. ముఖ్యంగా గణిత శాస్త్రంలో విశేష కృషి సలిపిన కొంతమంది ఆంధ్రుల గురించి వివరించే ప్రయత్నమే ఈ వ్యాసం యొక్క ముఖ్యోద్దేశం.

ఈ వ్యాసంలో నలుగురు ప్రముఖులైన ఆంధ్ర గణిత శాస్త్రవేత్తల గురించి ప్రస్తావించడం జరిగింది. వీరందరూ కొన్ని శతాబ్దాల క్రిందటి వారే.. వీరే కాకుండా ఎంతోమంది గణితంలో కృషి సలిపిన ఆంధ్ర శాస్త్రజ్ఞులున్నారనేది వాస్తవం.

వీరే కాకుండా గత 100 సంవత్సరాలలో ఎంతోమంది భారతీయులు మన గణిత ప్రతిభ ప్రపంచానికి చాటిచెప్పేరు. అందులో చాలామంది ఆంధ్రులు కూడా ఉన్నారు వారెవరి గురించి కూడా ఈ వ్యాసంలో పొందుపరచలేదు. అందరి గురించి ఒకేసారి వ్రాయాలంటే అది వ్యాసం కాదు ఒక ఉద్గ్రంధమే అవుతుందండటంలో సందేహం లేదు. అందువల్ల ప్రధానంగా పావులూరి మల్లనామాత్యుడు, వల్లభామాత్యుడు, ఎలుగంటి పెద్దనార్యుడు మరియు తడకమళ్ల కృష్ణారావు గార్ల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది.

పావులూరి మల్లనామాత్యుడు
ఇతడు 11 లేదా 12వ శతాబ్దమువాడని నిర్ణయించబడినది. గోదావరి మండలంలోని పావులూరు గ్రామ కరణముగా వ్యవహరించెనని తెలియుచున్నది. ఇతడు మహావీరాచార్యుని యొక్క గణితసార సంగ్రహమన్న సంస్కృత గ్రంథమును తెనిగించెను. ఇది స్వతంత్ర గ్రంథము కాకపోయిననూ, అందలి పద్ధతులు మాత్రమే మహా వీరాచార్యునివి. లెక్కలన్నియు మల్లనాచార్యుడు సొంతముగా కల్పించెను. ఈ గ్రంథం యొక్క ప్రతులు పూర్తిగా లభింప లేదు. కొన్ని అసంపూర్ణమైన ప్రతులు మాత్రమే లభించినవి. అందులోని కొన్ని ఉదాహరణలు క్రింద ఈయబడినవి

1. అర్చకుండొకడు దివ్యాబ్జమున్ గొనివచ్చి
మూడచ్యుత స్థానమునకు జేర్చి
తొలి దేవళంబు ముంగలి కొలంకున దోగ
జేతి పువ్వులు యధాస్థితి దలిర్ప
నందుకొన్నిటిని దైత్యారికి నర్పించి
కడకు నాగుడి తటాకమున ముంప
దత్సూనములు రెట్టదవగ బిలార్వపురీతి
నర్పించి యవలికోశంబువలన
ద్రిగుణమైన మొదలి తీరున పరమేశు
బూజ సేసి మిగులు పూలు గుళ్ల
మూరట రెంట నొకటి మొగ వృద్ధిగా నుంచె
దొలుత నెన్ని దెచ్చె దోజయములు ?

దీనికి జవాబు 111 పువ్వులు దీనిని సాధించు విధానము కూడా ఈ క్రింది పద్యంలో చెప్పబడినది.

తిరమగు ప్రసూన వృద్ధు..
నరుపమ లిఖియించి యంశ వర్గంబు బర
స్పర గుణితంబైనను గన
బరగుం బజా ప్రమాణ పటలంబనఘా

2. ఖర్జూర ఫలములు గణకుండు గొనితెచ్చి
సగపాలు మోహంపు సతికి నిచ్చె
నందు నాల్గవ పాలు ననుగు దమ్మునికిచ్చె
నష్ట భాగం బిచ్చె నతని సతికి
దగడు తొమ్మిదవ పాలు తనయుని కిచ్చెను
దన చేత నాల్గున్న దల్లి కిచ్చె
మొదట దెచ్చిన వెన్ని? మోహంపు సతికెన్ని?
భ్రాత కెన్ని? వాని భార్యకెన్ని?
తనయునికెన్నిచ్చె దడయక తల్లికి
నాలుగెట్టులాయె నయముతోడ
గణిత మెరిగినట్టి కరణాల పిలిపించి
యడుగవలయువేవి! యవసరముగు!

లెక్క వేస్తే ఖర్జూరపు పళ్ళు 288. అందులో సతికి 144, తమ్ముడికి 72, తమ్ముడి భార్యకు 36, తనయుడికి 32, తల్లికి నాలుగు ఇచ్చినట్లు తెలుస్తుంది.

వల్లభామాత్యుడు
ఇతడు 16వ శతాబ్దికి మొదటినున్నవాడు. కృష్ణదేవరాయలకును, అచ్యుతరాయలకును సమకాలికుడైన బొమ్మలాట కాళుడను వాని ప్రార్ధన నంగీకరించి లీలావతి గణితమును తెలుగు పద్యములుగా చేసినని ఈ క్రింది పద్యము వలన తెలియుచున్నది.

శ్రీ నరసింహనందను నరిందమవిక్రమ గృష్ణరాయ భూ
జానిని వెండియుం దదనుజన్ముని నచ్యుత దేవరాయనిన్
దా నధికాప్తుడై కొలిచి తద్దయు నున్ననగాంచి మించునవి
ద్యా నిధి బొమ్మలాట విరుపాధిపు కాళని ప్రార్థనంబునన్

ఈ వల్లభామాత్యుని గ్రంథము సంపూర్ణముగా దొరకపోయిననూ దొరికినంత వరకూ ఇచ్చి చక్కటి భాషాంతరముగా చెప్పవవచ్చును.
మహావీరాచార్యుల వారి ‘గణితసార సంగ్రహము’ను ఒక వల్లభామాత్యుడు తెలుగునందును, కన్నడమునందును వ్రాసినట్లు కొన్ని కన్నడ గ్రంథముల వల్ల తెలియచున్నది. కాని ఆ వల్లభామాత్యుడు ఈ వల్లభామాత్యుడు ఒకరో కారో తెలియజేయు ఆధారములు మాత్రం లేవు.

ఎలుగంటి పెద్దనార్యుడు
ఇతడు ప్రకీర్ణ గణితమన పేర భిన్నరాశి వ్యవహారముల గురించి నొక గ్రంథమును వ్రాసెను. దీని కాలము స్పష్టముగ నిర్ణయించుటకు ఆధారాలు లేవు.

తడకమళ్ల కృష్ణారావు
ఇతడు సుమారు 100 సంవత్సరముల పూర్వమువాడు. చెన్న పట్టణపువాసి. ఈయన లీలావతిని భాషాంతీకరించి రేఖా గణిత, బీజగణితమును నవీన పద్ధతులనుసరించి వ్రాసెను.

ఇంకనూ సూత్ర గణితము, వేంకటేశ గణితమను పేర్లతో గ్రంథములు కలవు. వాటి రచయితల వివరములు తెలియరాలేదు. ఆ గ్రంథములు సుమారు 250 సంవత్సరముల క్రితం వ్రాయబడి యుండవచ్చునని పండితుల అభిప్రాయం.

ఆధునిక గణిత శాస్త్రజ్ఞులు, ఆంధ్రులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వారెందరో ఉన్నారు. సమయాభావం వల్లనూ, ఆధునిక శాస్త్రవేత్తల గురించి చాలా సమాచారం లభ్యమవుతుండడంచేతనూ ఇక్కడ వారి గురించి ప్రస్తావించలేదు.

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమను పేరిట మూడు సంపుటములు, సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము అను 8 సంపుటాలు ప్రపంచంలో ప్రాచీన దశ నుండి 20వ శతాబ్దపు తొలినాళ్ల వరకు, జరిగిన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలపై క్లుప్తంగా విశదీకరించడం జరిగింది. వీటిల్లో ఆంధ్రుల పాత్ర గురించి కూడా అక్కడక్కడా ప్రస్తావన ఉన్నది.

వ్యాసకర్త – ఆచార్య పేరి సర్వేశ్వర అవధాని