తమిళనాడులోని 55 ప్రాంతాల్లో విజయవంతంగా పథ సంచాలన్ ర్యాలీలను నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

చెన్నైలో నవంబర్ 19న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచాలన్‌లు స్థాపన దినోత్సవం రోజున సంత్ రామలింగ స్వామిగళ్ (వడలూర్ వల్లలార్) 200వ జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్బంగా స్వయంసేవకులు పథ సంచాలన్ ర్యాలీని నిర్వహించారు.
తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కవాతుకు నిర్వహించేందుకు తొలుత డిఎంకె ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.దీంతో మద్రాసు హైకోర్టును ఆర్ఎస్ఎస్ ఆశ్రయించగా అక్టోబరు 22, 29 తేదీల్లో ఆర్‌ఎస్‌ఎస్ పథ సంచాలన్‌లు నిర్వహించేందుకు అనుమతినిస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు గత ఏడాది నవంబర్‌లో కొన్ని షరతులతో ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేయడానికి బదులుగా డిఎంకె ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చివరకు ఎలాంటి షరతులు లేకుండా ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ సుప్రీం కోర్ట్ తీర్పు వెల్లడించింది.
నవంబర్ 19న ఆర్‌ఎస్‌ఎస్ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విజయవంతంగా ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు పథ సంచాలన్‌లను నిర్వహించి శాంతియుత స్వభావాన్ని చాటారు. 
చెన్నైలో మూడు కిలోమీటర్లకు పైగా సాగిన ర్యాలీలో వేలాది మంది ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు తమ యూనిఫామ్ ధరించి పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు స్వయంసేవకులపై పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు.
1,000 మందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్న చెన్నై క్రోమ్‌ప్ట్ ర్యాలీకి కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. 
కారైకుడి జిల్లాలో 400 మందికి పైగా స్వయంసేవకులు పథ సంచాలన్‌లో పాల్గొన్నారు. న్యాయమూర్తి అరుణ్ స్వామినాథన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిచారు. స్వయంసేవకుల ర్యాలీ మాగర్ నాన్బీ తిడల్ వద్ద ప్రారంభమై తేవర్ విగ్రహం వరకు సాగింది.ర్యాలీ అనంతరం మున్సిపల్ పార్క్ దగ్గర జరిగిన బహిరంగ సభకు ఆరుముగం పిళ్లై, సీతయ్యమ్మాళ్ ఎడ్యుకేషనల్ గ్రూప్ వైస్ చైర్మన్ రామేశ్వరన్ అధ్యక్షత వహించారు.
కోయంబత్తూరులోని తుడియాలూరులో పథ సంచాలన్ బస్టాండ్ నుండి ప్రారంభమై రైల్వే స్టేషన్ రోడ్డు, చేరన్ కాలనీ, విశ్వనాథపురం మీదుగా సాగి మెట్టుపాళయం వరకు సాగింది. సర్కస్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కోయంబత్తూర్ జిల్లా తేవన్ పెరవై అధ్యక్షుడు సుంద్ర తేవర్, వారాహి మణికంద స్వామిగల్ వంటి వక్తలు పాల్గొన్నారు.
తిరుపూర్‌లో ఆలంగాడు నటరాజ్ థియేటర్ దగ్గర ప్రారంభమైన పథ సంచాలన్ ర్యాలీ చెల్లంనగర్ వరకు కొనసాగింది.ఈ ర్యాలీలో అవినాశి తిరుపుకొల్లియూర్ వాకేశ మఠానికి చెందిన కామచ్చి దాసు స్వామిగల్, సివిల్ ఇంజినీర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు షణ్ముగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నీలగిరి జిల్లాలో స్వయంసేవకుల పథ సంచాలన్ పందలూరు ఎరుమాడు ప్రాంతంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ వద్ద నిర్వహించారు.అడ్వకేట్ ఇస్సాక్, దక్షిణ తమిళనాడు కార్యదర్శి మోహన్ నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగింది. దారిపొడవున దేశభక్తి గీతాలు ప్రతిధ్వనించాయి
తంజావూరు జిల్లాలో తంజావూరు, పేరవూరని ప్రాంతాల్లో పథ సంచాలన్‌లు జరిగాయి. తంజావూరులో ర్యాలీ పశ్చిమ వీధిలోని బంగారు కమచ్చి కళ్యాణ మండపం వద్ద ప్రారంభమై పానగల్ భవనం వరకు కొనసాగింది. పేరవూరనిలో నీలకంఠన్ ఆధ్వర్యంలో ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రారంభమై వేదానందం మైదానం వరకు కొనసాగింది.
సేలం జిల్లా మరవనేరిలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీని ఉట్టర్ తమిళనాడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు వివేకానందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్నారు.సేలం జిల్లా వజాపాడిలో జరిగిన ర్యాలీలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలతో పాటు చిన్నారులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తమిళనాడులో పథ సంచాలన్‌లను విజయవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్-ఆర్‌ఎస్‌ఎస్ సమిష్టి కృషిని ప్రదర్శించింది. ఇది సాంస్కృతిక, రాజకీయ ప్రాముఖ్యతల సమ్మేళనాన్ని తెలిపింది.
తమిళనాడులోని 55 చోట్ల నిర్వహించిన పథ సంచాలన్‌ల్లో 20 వేల మందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్నారు.






