News

జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

285views

జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇక్కడి కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను లష్కర్‌ తోయిబాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాంలోని సామ్నో ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు గురువారం రాత్రి స్థానికంగా తనిఖీలు చేపట్టాయి.

ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. అయితే, చీకటి పడటంతో.. పకడ్బందీ నిఘా మధ్య ఆపరేషన్‌కు విరామం ఇచ్చారు. మళ్లీ రెండో రోజు శుక్రవారం తెల్లవారుజామున ఇరుపక్షాల నడుమ కాల్పులు జరిగాయి. మొత్తం 18 గంటలపాటు సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పుల ధాటికి ఉగ్రవాదులు దాక్కుని ఉన్న ఇల్లు మంటల్లో కాలిపోయిందని, దీంతో వారంతా బయటకు వచ్చినట్లు చెప్పారు.

మరోవైపు.. పాకిస్థాన్‌తో సరిహద్దు వెంబడి పూంచ్‌ జిల్లాలో అనుమానాస్పద కదలికలు కనిపించడంతో భద్రతాసిబ్బంది అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే తనిఖీలు ముమ్మరం చేసింది. అంతకుముందు ఉరీ సెక్టార్‌లో కీలక ఉగ్రవాది, లాంచ్‌ కమాండర్‌ బషీర్‌ అహ్మద్‌ మాలిక్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. నియంత్రణ రేఖ వెంబడి సైన్యం, జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు కలిసి ‘ఆపరేషన్‌ కాళీ’ పేరుతో చేపట్టిన సంయుక్త చర్యలో మాలిక్‌ సహా మరో ఉగ్రవాదిని అంతమొందించినట్లు అధికారులు తెలిపారు.