
ఇస్లాం మతంలోకి మారాలని కొందరు యువకులు బలవంతం చేయడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో వెలుగుచూసింది. మృతురాలి సోదరి కథనం ప్రకారం..జోహిద్ అక్తర్ అనే యువకుడు అతని స్నేహితుల బృందం బాలికను మతం మారాల్సిందిగా తరచూ వేధింపులకు గురి చేశారు. మతం మారేందుకు బాలిక నిరాకరించడంతో ఆమె అభ్యంతరకర వీడియోను నెట్టింట వైరల్ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక తన ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది.
బాలిక బలవన్మరణంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి తరపు బంధువులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు జోహిద్‌ను అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నేపాల్ సరిహద్దు గ్రామాల్లో మత మార్పిడీలకు సంబంధించిన ఉదంతాలు తరచుగా వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.





