
బ్యాలెట్ బాక్స్, భద్రతా దళ సిబ్బందితో పోలింగ్ సిబ్బంది ప్రవేశించవద్దని చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్లో నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేశారు. కరపత్రాలపై పోలింగ్ సిబ్బందిని రావద్దని స్పష్టంగా రాసిపెట్టారు. ఇది కేవలం పోలింగ్ సిబ్బంది మాత్రమే కాకుండా.. అభ్యర్థులు, భద్రతా సిబ్బందికి కూడా వర్తిస్తుందని వారు తెలిపారు. అయితే నక్సలైట్లకు పోలింగ్ సిబ్బంది ఘాటైన సమాధానం ఇస్తూ ఫేస్బుక్, సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ”రేపు వెళ్లాలి.. ఏం జరిగినా సరే వెళ్దాం” అని రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బంది మాట్లాడుతూ.. తాము నిస్సహాయులమని, పరిపాలన ముందు తలవంచుతున్నామని, ఏమీ చేయలేమని అన్నారు. అయినప్పటికీ తాము తమ విధులు నిర్వహించేందుకే మొగ్గు చూపుతామన్నారు. తమకు ఏమైనా జరిగితే తమ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని, గెలుపొందే అభ్యర్థులను కోరారు. తమ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు వారిపై మానవతా దృక్పథాన్ని చూపించాలని వారు కోరారు. తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తాము పోలింగ్ స్టేషన్లకు వెళ్తున్నట్లు కుండబద్దలు కొట్టి చెప్పారు. రాష్ట్రంలో నవంబర్ 7, నవంబర్ 17న రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 3న విడుదల అవుతాయి.





