గాజా యుద్ధం ఆపే సామర్థ్యం భారత్‌కి ఉంది ; మానవ స్ఫూర్తిని ప్రదర్శించడంలో భారత్ చరిత్ర అద్భుతం : కొనియాడిన ఇరాన్ రాయబారి

హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ఆపే సామర్థ్యం భారతదేశానికి ఉందని భారత్‌లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి అన్నారు.
ప్రపంచ వేదికపై భారతదేశపు నైతికత, మానవత్వంపై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రస్తుతం గాజా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడంలో కీలక పాత్ర పోషించగల సామర్థ్యం భారత్‌కి ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన.. గాజాలో ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న భూతల దాడుల్ని తీవ్రంగా ఖండించారు.
ఓ మీడియా సంస్థతో ఇరాజ్ మాట్లాడుతూ.. ”నైతిక ధైర్యాన్ని, అణచివేయలేని మానవ స్ఫూర్తిని ప్రదర్శించడంలో భాతరదేశం గొప్ప చరిత్రను కలిగి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే.. గాజాలో జరుగుతున్న మారణహోమం పట్ల భారత్ కళ్లు మూసుకొని ఉండదని నేను దృఢంగా విశ్వసిస్తున్నా. గాజాలో ఇజ్రాయెల్ విధించిన క్రూరత్వాలను అంతం చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది” అని అన్నారు. భారతదేశం గ్లోబల్ సౌత్ వాయిస్‌గా మారాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మహాత్మా గాంధీ బోధనల ప్రభావం, పాలస్తీనాపై ఆయన స్ఫూర్తిదాయకమైన పదాలు.. అందరి సామూహిక స్మృతిలో నిలిచిపోయాయని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితులు.. గ్లోబల్ సౌత్ స్వరంగా మారే ప్రధాన అవకాశాన్ని భారత్‌కి అందిస్తున్నాయని ఇరాజ్ అన్నారు. పాలస్తీనా ప్రజల కోసం భారతదేశం పంపిన మానవతా సహాయానికి గాను ఆయన ధన్యవాదాలు తెలుపారు.





