
శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 10 నుంచి 18 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం జరుగనుందని.. ఇందుకోసం నవంబరు 18న అంకురార్పణ నిర్వహిస్తామని ఈవో తెలిపారు. ఈ పుష్పయాగం ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు నవంబరు 4న 1000 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. టికెట్ ధర రూ.700గా నిర్ణయించినట్లు తెలిపారు. 2024 ఏడాది డైరీలు, క్యాలెండర్లు తితిదే పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయని.. ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా భక్తులు కొనుగోలు చేయవచ్చని తెలిపారు.





