News

యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్‌, కోజికోడ్‌

290views

యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ’ (యూసీసీఎన్‌) జాబితాలో మన దేశంలోని గ్వాలియర్‌ (మధ్యప్రదేశ్‌), కోజికోడ్‌ (కేరళ)తో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది. అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తున్నందుకు, ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయడంతో సరికొత్త అభ్యాసాలు చేస్తున్నందుకు వీటిని గుర్తిస్తున్నట్లు యునెస్కో తెలిపింది. అక్టోబరు 31న ‘ప్రపంచ నగరాల దినోత్సవం’ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. సంగీత విభాగంలో గ్వాలియర్‌ను, సాహిత్యంలో కోజికోడ్‌ను ఈ జాబితాలో చేర్చారు. తాజా జాబితాలో కాఠ్‌మాండూ, రియో డీ జనీరో వంటి నగరాలు కూడా ఉన్నాయి. కొత్తవాటితో కలిపి యూసీసీఎన్‌ జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నట్లయింది.

యూసీసీఎన్‌ జాబితాలో స్థానం లభించడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేస్తూ ఆ రెండు నగరాల ప్రజల్ని అభినందించారు. మన సాంస్కృతిక వైభవం అంతర్జాతీయ వేదికపై మరింతగా తళుకులీనుతోందని చెప్పారు. భిన్న సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తొలుత కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తన హర్షాన్ని వ్యక్తపరుస్తూ చేసిన పోస్ట్‌పై ‘ఎక్స్‌’ వేదికగా మోదీ స్పందించారు.