News

ఎనిమిది అడుగుల సింహాసనంపై అయోధ్య రామయ్య

390views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉండే పాలరాతి సింహాసనంపై ఏర్పాటు చేయనున్నారు. ఈ సింహాసనానికి రాజస్థాన్‌లో శిల్పకారులు తుది మెరుగులు దిద్దుతున్నారని.. డిసెంబరు 15 నాటికి ఇది అయోధ్యకు చేరుకుంటుందని ట్రస్టు పేర్కొంది. ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని, ఈ నెల చివరికల్లా ప్రధాన గేటు నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది. భక్తులు సమర్పించిన బంగారు, వెండి వస్తువులను కరిగించి భద్రపరుస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 5న ఆలయంలో నిర్వహించే అక్షత పూజ కోసం ట్రస్టు 100 క్వింటాళ్ల బియ్యాన్ని ఆర్డర్‌ చేసింది. పసుపు, దేశీ నెయ్యి కలిపిన బియ్యాన్ని ఇత్తడి కలశాల్లో నింపి పూజ చేయనున్నారు. అనంతరం ఈ అక్షతలను విశ్వ హిందూ పరిషత్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

గర్భగుడి నిర్మాణం కూడా పూర్తయిందని ఆలయ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర తెలిపారు. డిసెంబర్ 15 నాటికి రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌ రెడీ అవుతుందని.. ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్​లో 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్​లో 17 స్తంభాలు ఏర్పాటు చేయగా, అందులో రెండింటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలోని మూడు అంతస్తుల్లో పైకప్పులు నిర్మించామని పేర్కొన్నారు.. అలాగే మందిరం ప్రవేశ ద్వారం వెలుపలి గోడ(పార్కోట) పనులు కూడా చివరి దశలో ఉన్నాయని వివరించారు.