
తిరుమలలో మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ నిబంధనలు ఉల్లంఘించారు. వివరాల్లోకి వెళితే.. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ను కూడా తీసుకొచ్చారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అన్యమత శిలువ గుర్తుతో మంత్రి రోజా ఫోటో గ్రాఫర్ తిరుమలకు రావడం చర్చనీయాంశం అయ్యింది. మంత్రి రోజా గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. మంత్రి పర్సనల్ ఫోటోగ్రాఫర్ స్టెయిన్ కూడా తిరుమలకు వచ్చాడు. ఈ క్రమంలోనే స్టెయిన్ మెడలో అన్యమత గుర్తు కలిగిన చైన్ కనిపించంది. తిరుమల శ్రీవారి ఆలయంకు అభిముఖంగా ఉన్న గొల్లమండపం దగ్గర ఫోటోగ్రాఫర్ షేన్ మెడలో చైన్ ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్ స్టెయిన్ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు. దీంతో ఈ చైన్ బయటపడింది. స్టెయిన్ పట్ల అక్కడి భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని అదుపులో ఉంచాల్సిన మంత్రి.. ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీవారి ఆలయం వద్ద ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. తిరుమల కొండపై అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఫొటోగ్రాఫర్ ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

తిరుమలలో అన్యమత గుర్తులు, రాజకీయ గుర్తులు, జెండాలు తిరుమలకు తీసుకుని రావొద్దని నిషేధం ఉన్నప్పటికి సాక్షాత్తూ మంత్రి పర్సనల్ ఫోటో గ్రాఫర్ షేన్ అన్యమత గుర్తు కలిగిన చైన్‌తో తిరుమలలో తిరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పందించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో కూడా పార్టీలకు సంబంధించిన జెండాలు కలకలంరేపాయి. తాజాగా మంత్రి ఫోటోగ్రాఫర్ ఇలా శిలువ గుర్తుతో కనిపించడం చర్చనీయాంశమైంది.




