News

40 ఏళ్ల తర్వాత భారత్‌, శ్రీలంక మధ్య ఫెర్రీ ప్రారంభం

313views

తమిళనాడులోని నాగపట్టినం హార్బర్‌ నుంచి శ్రీలంకలోని కాంగేసన్‌తురై హార్బర్‌ మధ్య ప్రయాణికుల ఫెర్రీ శనివారం ప్రారంభమైంది. శ్రీలంకలో యుద్ధ సమయంలో ఈ సర్వీసు రద్దవగా 40 ఏళ్ల తర్వాత పునరుద్ధరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. భారత్‌, శ్రీలంక సత్సంబంధాలకు ఫెర్రీ ప్రయాణం మైలురాయిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య జల రవాణా బలోపేతమవడమేకాక ప్రజల హృదయాలూ దగ్గరవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

చెన్నై, జాఫ్నా మధ్య 2019 నుంచి విమాన సర్వీసులు మొదలైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రవాణాతో పాటు ఫిన్‌టెక్‌, విద్యుత్తు రంగాల్లో శ్రీలంకతో కలిసి ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. యూపీఐ, లంకా పే అనుసంధానంపై రెండు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నాగపట్టినంలో కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌ తమిళనాడు మంత్రి ఈవీ వేలుతో కలిసి ఫెర్రీ ప్రారంభోత్సవంలో పాల్గొని జెండా ఊపి శ్రీలంకకు సాగనంపారు. ప్రయాణ దూరం 110 కి.మీ. కాగా 3.30- 4 గంటల సమయం పడుతోంది. ఒక్కొక్కరికి టికెట్‌ ధర జీఎస్టీతో కలిపి రూ.7,670గా నిర్ణయించారు. సర్వీసు ప్రారంభం నేపథ్యంలో శనివారం ఒక్కరోజు మాత్రం 75 శాతం రాయితీ ఇచ్చారు.