
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత యువతను ఒక్క వేదికపైకి తీసుకువచ్చేందుకు ‘మేరా యువ భారత్’ (మై భారత్) పేరుతో స్వయం ప్రతిపత్తిగల ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర వేశారు. 15-29 ఏళ్ల మధ్య వయసున్న 40 కోట్లమంది యువతను ఈ వేదికలో చేరడానికి అర్హులుగా నిర్ణయించారు. శక్తియుక్తులను వినియోగించుకుంటూ తమ కలలను నెరవేర్చుకునేలా వీరి సేవలను దేశ నిర్మాణంలో ఉపయోగించుకోవడానికి వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకుర్ తెలిపారు.
యువతకోసం ప్రభుత్వం తరఫున ఒక సంపూర్ణమైన వేదికను ఏర్పాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో యువతకు అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రభుత్వం-ప్రజల మధ్య వారు వారధులుగా మారి జాతి నిర్మాణంలో భాగస్వాములవుతారని ఠాకుర్ వెల్లడించారు. జాతీయ విధాన రూపకల్పనలో యువతను భాగస్వాములను చేసే విధంగా ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న వాతావరణం, కమ్యూనికేషన్లు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ అవకాశాలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న ఈ సంస్థను జాతికి అంకితం చేయనున్నారు.




