News

వచ్చే నెలలో వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు

298views

కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెలలో నిర్వహించనున్నారు. వచ్చే నెల 2 నుంచి 11వ తేదీ వరకూ నిర్వహించే ఈ ఉత్సవాల కోసం ఆహ్వాన పత్రిక, పోస్టర్లు సిద్ధం చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆదివారం విలేకర్లకు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాస కల్యాణం, మహా సుదర్శన హోమం, అష్టదళ పాద పద్మారాధన, పారమాత్మిక ఉపనిషత్‌ పూర్వక అష్టోత్తర శత కలశాభిషేకం, నవగ్రహ హోమం, తిరుప్పావడ సేవ, సంతాన గోపాల మూలమంత్ర పూర్వక హోమం, మహిళలతో సామూహిక కుంకుమార్చన, మహాలక్ష్మి మూలమంత్ర పూర్వక మహాలక్ష్మీ హోమం, మహా పుష్పయాగం, మహాపూర్ణాహుతి, అవభృథ స్నానం, చూర్ణోత్సోవం, మహదాశీర్వచనం తదితర అర్జిత సేవలు నిర్వహించనున్నామని వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్యం జరిగే అష్టోత్తర పూజలు, కల్యాణాలు, ఉపనయనాలు, వివాహలు రద్దు చేశామన్నారు.