News

క్యాథలిక్ చర్చిలో 600 మంది చిన్నారులను లైంగికంగా వేధింపులు

221views

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో క్రైస్తవ మతబోధకులు చిన్నారులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వస్తున్నాయి. బాల్టిమోర్ చర్చిలో గత 80 ఏళ్లలో సుమారు 600 మందికి పైగా చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యారని, 150 మందికి పైగా మతగురువులు ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్టు మేరీల్యాండ్ అటార్నీ జనరల్ ఆంతోని బ్రౌన్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. చర్చిలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బయట విస్తృతంగా ప్రచారం జరిగినా క్యాథలిక్ చర్చి దానిని దాచి ఉంచేందుకు ప్రయత్నించిందని ఆంతోని బ్రౌన్ తన 463 పేజీల నివేదికలో ఆరోపించారు. 2018 నుంచి ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. నివేదిక వెల్లడించిన అంశాల మీద బాధితులు, ఆందోళనకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాల్టిమోర్ బిషప్ విలియమ్ లోరి బాధితులకు క్షమాపణ చెప్పారు. ”చర్చి చరిత్రలో ఇది ఖండించాల్సిన విషయం” దానిని మరచిపోలేమని, అలాగని విస్మరించలేమన్నారు. ప్రభువును ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.లక్షల రికార్డుల సమీక్ష దర్యాప్తులో భాగంగా 1940ల నాటి నుంచి లక్షల రికార్డులను సమీక్షించారు. సుమారు 600 మందికి పైగా చిన్నారులను 156 మంది లైంగికంగా వేధించినట్లు తేలిందని ఆంటోని బ్రౌన్ తన నివేదికలో వెల్లడించారు. ” నిజానికి వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు” అని ఆయన చెప్పారు. ఒంటరి చిన్నారులే తరచూ వేధింపులకు గురైనట్లు విచారణలో తేలింది. చర్చితో సంబంధమున్న చిన్నారులపై ఈ అఘాయిత్యాలు జరిగాయి. చర్చి సిబ్బంది, పాటలు పాడే బృందంలోని సభ్యులు, చర్చి యువజన సంఘాల కార్యక్రమాల్లో పాల్గొనేవారు, చర్చికి సంబంధించిన గృహాల్లో పనిచేసేవారు బాధితుల్లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. మతగురువులు, చర్చికి సంబంధించిన ఇతర సిబ్బంది విచ్చలవిడిగా, నిరంతరాయంగా ఈ దారుణాలకు పాల్పడ్డారని విచారణలో తేలినట్టు అటార్నీ జనరల్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.నిందితులను కాపాడిన ‘మతాధికారులు’ చిన్నారులపై చర్చి సభ్యుల వేధింపులను బాల్టిమోర్ చర్చి ఒక పద్ధతి ప్రకారం, ఉద్దేశపూర్వకంగానే దాచి ఉంచిందని నివేదికలో ఆరోపించారు. బిషప్‌లు, చర్చి వ్యవహారాలు చూసుకునే కీలక వ్యక్తులు వేధింపులకు గురైన చిన్నారులపై కనికరం చూపించాల్సింది పోయి, వేధింపులకు గురిచేసిన వారిపైనే సానుభూతి చూపిస్తూ వచ్చారని నివేదిక తెలిపింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న మతాధికారులను కాపాడేందుకు చర్చి కీలక వ్యక్తులు ప్రయత్నించిన అనేక సందర్భాలను కూడా నివేదికలో ప్రస్తావించారు. వేధింపులకు పాల్పడిన వారిలో కొందరు అవే స్థానాల్లో కొనసాగుతుండగా, మరికొందరు పదోన్నతిపై ఇతర చర్చిలకు బదిలీ అయ్యారు. ఆరోపణలపై చర్చి ఆధర్యంలో జరిగిన విచారణ మతాధికారుల నేతృత్వంలో జరిగిందని, స్వతంత్ర వ్యక్తులతో విచారణ జరగలేదని నివేదిక వెల్లడించింది. వేధింపుల ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేశాయని, హృదయాన్ని ముక్కలు చేశాయని బిషప్ లోరి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ”ఈ దారుణ ఘటనలను ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులకు ఈ కఠోర నిజం తెలుసు. అలాంటి దారుణాలు జరిగాయి” అని ఆయన తెలిపారు.