
వరదలతో అల్లాడి రాజకీయంగా సంక్షుభితమై.. ఆర్థికంగా దిగజారి.. ఆకలికేకలు వేస్తున్న పాకిస్థాన్‌కు ఓ భారతీయుడి ద్వారా నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లనున్నాయి. అమెరికాలో ప్రొఫెసర్ ఉద్యోగం వదిలి నౌకా వ్యాపారంలోకి దిగిన డాక్టర్ అనిల్శర్మకు చెందిన కంపెనీ గ్లోబల్ మార్కెటింగ్ సిస్టమ్స్ (జీఎంసీ) ఈ పుణ్యం కట్టుకోనుంది. 50వేల టన్నుల గోధుమలతో రష్యా నుంచి బయల్దేరిన జీఎంసీ నౌక ‘ఎంవీ లీలా చెన్నై’ పాకిస్థాన్‌లోని గ్వదార్ తీరానికి చేరింది. కిలో గోధుమల ప్యాకెట్ కోసం కొట్లాడుకునే దుస్థితి నెలకొన్న ఆ దేశానికి ఇది పెద్ద ఉపశమనం కలిగించనుంది. 4.50 లక్షల టన్నుల గోధుమల దిగుమతికి రష్యాతో పాక్ ఒప్పందం చేసుకుంది. ఇందులోభాగంగా తొలి విడతను జీఎంసీ సరఫరా చేసింది. లైబీరియా జెండాతో లీలా చెన్నై నౌక ఫిబ్రవరి 10న రష్యాలోని నొవొరొసిస్క్ తీరం నుంచి బయల్దేరి మార్చి 1న గ్వదార్ చేరింది. డాక్టర్ అనిల్శర్మది గుజరాత్. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్, డాక్టరేట్ పూర్తిచేశారు. ప్రముఖ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్‌గా పదేళ్లుపనిచేశారు. 1992లో ఉద్యోగం వదిలి జీఎంసీని స్థాపించారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న అనిల్‌శర్మ.. భారత ఫుట్‌బాల్ లీగ్ ఐఎ్‌సఎల్‌లో ఒడిశా ఎఫ్సీకి యజమాని కూడా.





