News

ఇది యుద్ధాల యుగం కాదు.. ఉక్రెయిన్‌-రష్యాలకు భారత్‌ సూచన

195views

ఇది యుద్ధాల యుగం కాదంటూ ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై తన వైఖరిని భారతదేశం పునరుద్ఘాటించింది. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం బుధవారం రాత్రి ప్రారంభమైంది. గురువారం కూడా ఈ సమావేశం కొనసాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశంలో ప్రసంగించే అవకాశం ఉంది. ఆ వివరాలను విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్‌ క్వట్ర బుధవారం విలేకరులకు వెల్లడించారు. ‘ఇది యుద్ధాల యుగం కాదనేదే భారత వైఖరి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా రష్యా-ఉక్రెయిన్‌ సమస్యను పరిష్కరించుకోవాలి. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో దీనిపై కీలక చర్చ జరగనుంది. విదేశాంగ మంత్రులంతా ఆ పరిణామాలపై దృష్టి పెట్టనున్నారు. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా సహా ప్రపంచంపై ఆ యుద్ధం ప్రభావాలను వారంతా చర్చించనున్నారు. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వస్తు-సేవలకు డిమాండ్‌ తగ్గడం, ఆహార, ఇంధన, ఎరువుల ధరలు పెరగడంపై చేపట్టాల్సిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది’ అని వినయ్‌ క్వట్ర చెప్పారు. సమావేశాన్ని రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారని, మొదటి సెషన్‌లో ఆహారం, ఇంధన సంబంధిత అంశాలు, రెండో సెషన్‌లో ఉగ్రవాదం, నార్కోటిక్స్‌, గ్లోబల్‌ స్కిల్‌ మ్యాపింగ్‌, గ్లోబల్‌ టాలెంట్‌ పూల్స్‌ అనే అంశాలపై విదేశాంగ మంత్రులు చర్చిస్తారని తెలిపారు. జీ20 అధ్యక్ష బాధ్యతల్లో విదేశాంగ మంత్రులతో నిర్వహిస్తున్న అతి పెద్ద సమావేశంగా దీన్ని ఆయన అభివర్ణించారు. జీ20లో సభ్యులు కాని బంగ్లాదేశ్‌, ఈజిప్టు, మారిషస్‌, నెదర్లాండ్స్‌, నైజీరియా, ఒమన్‌, సింగపూర్‌, నైజీరియా, యూఏఈ దేశాల విదేశాంగమంత్రులను కూడా సమావేశానికి ఆహ్వానించినట్టు తెలిపారు. 13 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సహా 40కిపైగా ప్రతినిధి బృందాలు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు.

ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు చర్యలు..

హరియాణాలోని గురుగ్రామ్‌లో జీ20 దేశాల అవినీతి వ్యతిరేక వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. దేశం నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల అప్పగింత, చోరీ సొత్తు రికవరీ కోసం ద్వైపాక్షిక సహకారం కంటే కూడా బహుళపక్ష చర్యలు అవసరమని ఈ సమావేశంలో భారత్‌ నొక్కి చెప్పింది. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాలను తిరిగి దేశంలోకి తీసుకొచ్చి శిక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ ‘అవినీతిపరులు తమ నేరాలను కొనసాగించడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు. ఆ డబ్బు దుష్టకార్యాల్లోకి వెళుతోంది. ఉగ్రవాదులకు అందే నిధుల్లో ఇదే ప్రధానమైనది. యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్‌ నుంచి మానవ అక్రమ రవాణా వ రకు, అలాగే ప్రజాస్వామ్యాలను బలహీనం చేయడం నుంచి అక్రమ ఆయుధాల విక్రయం వరకు ఈ డబ్బే ఉపయోగపడుతోంది. ఈ డబ్బు అనేక విధ్వంసకర సంస్థలకు చేరుతోంది. జీ20 దేశాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మరింత వేగవంతంగా ఆస్తుల స్వాధీనానికి అంతర్జాతీయ సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉంది’ అన్నారు.

రష్యా మంత్రితో జైశంకర్‌ చర్చలు…

ఉక్రెయిన్‌ యుద్ధంపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో మంత్రి జైశంకర్‌ విస్తృత చర్చలు జరిపారు. భారత్‌, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు, జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి సంబంధించిన అంశాలపైనా జైశంకర్‌, లావ్‌రోవ్‌ చర్చించారు. జీ20 సమావేశంలో భాగంగా బుధవారం ఇద్దరూ ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఆ వివరాలను జైశంకర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఐరాస, జీ20, ఎస్‌సీవో(షాంఘ సహకార సంస్థ), బ్రిక్స్‌ సహా బహుళపక్ష వేదికలపై సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరువురు మంత్రులు నిర్ణయానికి వచ్చారని రష్యా కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.