News

శ్రీ లక్ష చండీ మహా యజ్ఞంపై త్వరలో డాక్యుమెంటరీ తీస్తాం – స్వాత్మానందేంద్ర స్వామి

313views

విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో విజయవంతంగా సాగిన శ్రీ లక్ష చండీ మహా యజ్ఞంపై త్వరలో డాక్యుమెంటరీని రూపొందించబోతున్నామని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. ఈ భూమండలంపై లక్ష చండీ మహా యజ్ఞాన్ని తొలిసారి నిర్వహించిన ఘనత విశాఖ శ్రీ శారదాపీఠానికే దక్కుతుందని, భవిష్యత్‌ తరాలకు ఈ వివరాలను అందించే ఉద్దేశ్యంతోనే డాక్యుమెంటరీని రూపొందించే ఆలోచన చేస్తున్నామని వివరించారు. స్వాత్మానందేంద్ర స్వామి ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడారు. ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా లక్ష చండీ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై 8నెలల పాటు కసరత్తు చేసామని వివరించారు. అనేక గ్రంధాలను తిరగేసిన తర్వాత శాస్త్రీయ కోణంలో లక్ష చండీ యజ్ఞం నిర్వహణపై ప్రణాళిక రచించామని వివరించారు. భవిష్యత్తులో ఈ యజ్ఞాన్ని తలపెట్టాలనుకునే వారు తమను సంప్రదించవచ్చని అన్నారు. హిందూ జాతిని జాగృతం చేసేందుకే దేశ నలుమూలల నుంచి వచ్చిన రుత్విక్కులకు యజ్ఞంలో భాగస్వామ్యం కల్పించామని వివరించారు.

కొందరు పనిగట్టుకుని తమ పీఠంపై రాజకీయ ముద్ర వేస్తున్నారని స్వాత్మానందేంద్ర స్వామి చెప్పారు. కానీ, రాజశ్యామల అనుగ్రహం అందరికీ ఉండాలనే తమ పీఠం భావిస్తుందని చెప్పారు. అమ్మవారి అనుగ్రహం కోసం వచ్చే నేతల కారణంగా ప్రత్యేక ఆకర్షణ అవుతోందని వివరించారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఎవరికీ వత్తాసు పలకదని, హిందూ ధర్మం వైపే నిలబడుతుందని స్పష్టం చేసారు. రాజకీయ పార్టీల కోసం పూజలు చేయడం లేదని, రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం కోరుకునే వారి కోసం మాత్రమే పీఠంలో పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖ శ్రీ శారదాపీఠానికి వ్యక్తిగత ఆలోచనలు ఉండబోవని, సమాజ హితం కోసం మాత్రమే పని చేస్తుందని స్పష్టం చేశారు.