
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శివాలయాన్ని దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు స్వామి కమలానంద భారతి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు దేవాలయ భూములను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. ఈ విధంగా దేవాలయాల భూములు ఆక్రమించడం పరిపాటిగా మారిందన్నారు. దేవాలయాల భూముల ఆక్రమణపై వైకాపా అధిష్టానం స్పందించాలన్నారు. దేవాలయాల భూములు ఆక్రమించిన వారికి పార్టీతో సంబంధం లేకుండా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కమలానంద భారతి డిమాండ్ చేశారు.
శ్రీకాళహస్తి దేవాలయంలో నియమాలను ఉల్లంఘించి షూటింగులు చేయడం సరికాదని కమలానంద భారతి అన్నారు. మంగ్లీ కేవలం గాయకి, నర్తకి మాత్రమేనని ఆమె తప్పులేదని అన్నారు. దేవాలయంలో షూటింగ్ చేసిన ఆర్గనైజింగ్ టీమ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల భద్రతా లోపం వల్ల తిరుమలలో డ్రోన్ ఎగరవేయడం కలకలం రేగిందని, దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కమలానంద భారతి కోరారు.





