News

వందేభారత్ రైళ్లపై రాళ్లేయకండి – దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి

299views

తెలుగు రాష్ట్రాల పరిధిలో నడుస్తున్న వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇవాళ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. భారతీయ రైల్వేల తరపున దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఏ ప్రకటన విడుదల చేశారు. జాతీయ ఆస్తులకు నష్టం లేదా విఘాతం కలిగించే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలాగే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి కార్యకలాపాలను అరికట్టేందుకు సహకరించాలని ప్రజలకు సంబంధించిన ఆస్తులను రక్షించాలని దక్షిణ మధ్య రైల్వే సాధారణ ప్రజలను అభ్యర్థించింది.

దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలలో భారతీయ రైల్వేలు ఒకటని, దేశ ప్రజలకు 160 సంవత్సరాల నుండి రవాణా రంగంతో పాటు వివిధ రకాలైన సేవలు చేయడమే కాకుండా దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. దేశంలోని వివిధ ప్రదేశాలను రైలు మార్గాలతో కలుపుతూ మిలియన్ల మంది ప్రయాణీకులకు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణాను అందిస్తుందని వెల్లడించింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్న సమయంలో దేశమంతా లాక్‌డౌన్ బరిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో కుడా భారతీయ రైల్వే సేవాదృక్పథంతో దేశ ప్రయోజనాల దృష్ట్యా రైలు సేవలను 24 గంటలూ నడిపిందని తెలిపింది.