ArticlesNews

కళా తపస్వి వెళ్లిపోయావా.. నీకిష్టమైన శివయ్య దగ్గరికి!

392views

దర్శకుడు అంటే దార్శనికుడు… ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట ఉండేవాడు.. ఆ విద్యలో కె.విశ్వనాథ్‌ ఎవరెస్ట్‌ అని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్‌ గురువారం రాత్రి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్‌. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. విశ్వనాథ్ స్వతహాగా శివయ్య భక్తుడు.. అందుకే ఆయన సినిమాల్లో శివయ్యను తలుచుకునే పాట కచ్చితంగా ఒకటి ఉంటుంది. సమాజంలోని కులాల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు లేవని.. కుల రహిత సమాజా నిర్మాణానికి పరోక్ష్యంగా ఆయన అనేక సినిమాలు తీశారు. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కె.విశ్వనాథ్ సినిమాలు తెలుగు పరిశ్రమపై ఉన్న ధోరణిని మార్చేశాయి. ఆయన సినిమాలు దక్షిణాది రాష్ట్రాల్లో సంగీతాన్ని నిద్రలేపాయి. కళను ఆరాధించేవాళ్లతో కన్నీళ్లు పెట్టించాయి.. లేచి నిలబడి తలొంచి నమస్కరించేలా చేశాయి.. ఆత్మగౌరవంతో ఎలా బతకాలో నేర్పించాయి. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభసంకల్పం ఇలా ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తెలుగు వారికి అందించిన మహనీయులు కళాతపస్వి కె.విశ్వనాథ్.

ఆయనకు శివుడంటే మహాఇష్టం.. అందుకే దాదాపు విశ్వనాథ్ సినిమాల్లో శివుడి ప్రస్తావన, పాట తప్పనిసరిగా ఉంటుంది. అదికూడా ఏదో కథలో ఇరికించే ప్రయత్నం కాకుండా.. కథలో అలా కలసిపోతుంది.. అదీ కళాతపస్వి గొప్పతనం.

భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే అని విశ్వనాథ్ సినిమాలో పాటలు వింటే అర్థం అవుతుంది.
‘సిరివెన్నెల’ ఇది భక్తి సినిమా కాదు.. శివుడి గురించి చెప్పే సినిమా అస్సలే కాదు. ఓ కళాకారుడి కోరిక నెరవేరాలని శివుడిని వేడుకోమని…తనను ఆరాధించే అమ్మాయి చెబితే… అందుకు సమాధానంగా… బూడిదినిచ్చే శివుడుని ఏం కోరుకోవాలి, తియ్యటి పాటలు పాడే కోకిలకి నలుపు రంగేంటి..? గర్జనలు చేసే ఆ మేఘాలకి మెరుపులు అద్దడం ఏంటి..? అని వివరిస్తాడు. ఇక్కడ శివ లీలను తెలియజేయడమే కాదు.. మనం ఏం కోరుకున్నప్పటికీ మనకు ఏం ఇవ్వాలో ఆ శివయ్యకి తెలుసని చెప్పే చక్కని వివరణగా చెప్పవచ్చు.

సాగరసంగమం- తకిట తథిమి తందానా
జీవితంలో ఓడిపోయి, అయినవారిని కోల్పోయి.. కలలు నెరవేరక, కళను ప్రదర్శించే అవకాశం రాక.. జీవితంపై నిర్వేదం పేరుకుపోయినప్పుడు.. ఉంటే ఎంత పోతే ఎంత అనే బాధతో.. బతుకుని ఆటగా చూసే కథానాయకుడి అభిప్రాయాన్ని ఇలా
“నరుడి బత్రుకు నటన ఈశ్వరుని తలపు ఘటన ఈ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన” అంటూ ఈశ్వరతత్వానికి ముడిపెట్టారు కె.విశ్వనాథ్.

 

స్వర్ణకమలం – అందెలరవమిది
కథానాయికలోని అల్లరిని, చిలిపితనాన్ని మాత్రమే కాదు.. ఆమెలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కళాకారిణిని చూడాలన్న తపన .. ఇతరదేశస్తులు కూడా భారతీయ కళలని అభ్యసించడానికి తమ జీవితాన్ని ధారపోస్తున్నారని అర్ధమయ్యేలా చెబుతూ.. శాశ్వతమైన పరిపూర్ణమైన, ఆనందానికి దూరమువుతున్న కధానాయికని చేయిపట్టి నడిపించే ప్రయత్నంలో.. ఆమెలో అసలైన కళాకారిణి మేల్కొన్న సందర్భంగా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నటరాజుకి అంకితం చేసిన పాట ఇది.

 

శంకరాభరణం- శంకరా నాదశరీరాపరా
శంకరాభరణం సినిమాలో… తోటి కళాకారులు తాను తీసుకువచ్చిన మనిషిలో కళను చూడకుండా, కులాన్నే చూసి వేదిక వదిలి వెళ్ళిపోతే, శంకరశాస్త్రి బాధతో ఆవేదనతో ఎదుట ఉన్న శివుడిని నిందిస్తూ, ధారాపాతంగా వాన కురుస్తున్నా పట్టించుకోకుండా “పరవశాన శిరసూ గంగ; ధరకు జారెనా శివగంగ” అంటూ శివుడిని నిలదీస్తూ ప్రశ్నిస్తే పాట అద్భుతం

ఆపద్భాంధవుడు- శివుడి గెటప్

చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రం. శివుడు పేరెత్తితే ఊగిపోయే కథానాయకుడికి ఆ వేషం వేసే అవకాశం వస్తే ఇక శివతాండవమే అనిపించాడు..

 

 

సాగర సంగమం-
పంచభూతాలు అంటే భూతాలు దయ్యాలు కాదు.. ఆ భూతనాథుడైన శివుడి అధీనంలో ఉండే ప్రకృతి. అందుకే శివం పంచభూతాత్మకం అంటారు. దీనికి సరైన అర్థం తెలియని కళాకారిణి కళను అవమానిస్తుంటే చూసి భరించలేని అసలు సిసలు కళాకారుడు నటరాజు సన్నిధిలో అసలైన అర్థాన్ని చెప్పే సందర్భం అద్భుతం.